మంత్రి కేటీఆర్ అన్ని పదవులకూ సమర్ధుడేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన్ను సీఎం చేయాలనుకుంటే చేస్తారన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేయబోరన్నది తన నమ్మకమని పేర్కొన్నారు.
శాసన మండలిలోని తన ఛాంబర్లో సోమవారం సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, అయితే ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈసారి సభకు నాలుగు బిల్లులు వచ్చే అవకాశం ఉందని, నూతన రెవెన్యూ చట్టాన్ని ఈ సమావేశాల్లోనే తేవాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిపారు.
శాసనసభ సమావేశాలు కోవిడ్ నిబంధనల మేరకు జరుగుతాయని వెల్లడించారు. థర్మల్ స్ర్కీనింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భౌతిక దూరం ఉండే విధంగా ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా మండలిలో కొత్తగా 8 సీట్లను ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా జలాలకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకుపోతానంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తాను, జానారెడ్డి కలిసి పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వానికి లేఖ రాశామని, అప్పటి ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ ప్రాంత మంత్రులు ఒక్కరు కూడా ఈ విషయమై మాట్లాడలేదన్నారు. కాగా, సీఎం కేసీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వర్తిస్తానని చెప్పారు.
తనకు వచ్చిన రాజ్యాంగ పదవిలో తాను సంతృప్తిగానే ఉన్నానని అన్నారు. రాజకీయ సమీకరణలో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్పదన్నారు