Home / SLIDER / కేంద్రం ఆప్షన్లతో రాష్ట్రాలకు నష్టం-మంత్రి హారీష్

కేంద్రం ఆప్షన్లతో రాష్ట్రాలకు నష్టం-మంత్రి హారీష్

జీఎస్టీ పరిహా రం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ మొత్తాన్ని కేంద్రమే రుణం తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పరిహారాన్ని రూ.1.65 లక్షల కోట్లకు పరిమితం చేయడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్లు రాష్ర్టాలకు నష్టదాయకమేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్‌ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారన్నారు. కేంద్రానికి ఆప్షన్లు లేవని,100 శాతం చెల్లించాల్సిందేనని చెప్పారు. ‘మొదటి ఆప్షన్‌లో పరిహారాన్ని రూ.1.35 లక్షల కోట్లు తగ్గించారు. రెండో ఆప్షన్‌లో పరిహారం లేదా 1శాతం ఎఫ్‌ఆర్బీఎంలో ఏది ఎక్కువైతే అది అప్పుగా తెచ్చుకోమన్నారు. తెలంగాణకు 1శాతం ఎఫ్‌ఆర్బీఎం అంటే దాదాపు రూ.10 వేల కోట్లు. పరిహారం రూపంలో రావాల్సిం ది కూడా అంతే. కాబట్టి తెలంగాణ వంటి రాష్ర్టాలకు రెండు ఆప్షన్లతోనూ నష్టమే’ అని హరీశ్‌రావు వివరించారు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం వైఖరిపై మంత్రి హరీశ్‌రావు సోమవారం పశ్చిమబెంగాల్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ తదితర రాష్ర్టాల ఆర్థికశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ర్టాలకు 14% వృద్ధిరేటు ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

ఇది రూ.3 లక్షల కోట్లని చెప్పారు. కానీ కేంద్రం ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌, కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల పరిహారాన్ని ఎగ్గొట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. కొవిడ్‌ లేదా ప్రకృతి వైపరీత్యాల పేరుతో పరిహారంలో మార్పు చేసేందుకు జీఎస్టీ చట్టంలో ఎక్కడా అవకాశం లేదని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్‌ను సంప్రదించినప్పుడు సైతం పరిహారం మొత్తాన్ని రాష్ర్టాలకు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసినట్టు హరీశ్‌రావు తెలిపారు. ‘జీఎస్టీ కౌన్సిల్‌ 7, 8వ కౌన్సిల్‌ సమావేశాల్లో అప్పటి ఆర్థికమంత్రి, దివంగత అరుణ్‌జైట్లీ సైతం రాష్ర్టాలు సెస్సు నష్టపోతే కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు తీర్మానం కూడా ఆమోదించారు’ అని గుర్తుచేశారు. కాబట్టి చట్ట ప్రకారం చూసినా, నైతికంగా చూసినా కేంద్రం మొత్తం పరిహారాన్ని రాష్ర్టాలకు చెల్లించాల్సిందేనని మంత్రి స్పష్టంచేశారు. ఈ విషయంలో రెండో మాటకు తావు లేదన్నారు. కేంద్రమే రుణం తీసుకొని 100% పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

తగ్గించే అధికారం ఎవరిచ్చారు?
‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌, కొవిడ్‌’ పేరుతో వృద్ధిరేటును 14% నుంచి 10 శాతానికి తగ్గించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. పార్లమెంట్‌కు మాత్రమే ఆ అధికారం ఉన్నదని స్పష్టం చేశారు. గత మూడేండ్లలో జీఎస్టీ సెస్సు డబ్బు మిగిలినప్పుడు, ఐజీఎస్టీ నిధులను కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు తగ్గగానే రాష్ర్టాలను అప్పులు తీసుకోమనడం ఎక్కడి నీతి? అని సూటిగా ప్రశ్నించారు. ‘మిగిలితే తీసుకుంటాం.. తగిలితే అప్పు తెచ్చుకోండి’ అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.

ఇదేనా పెద్దన్న పాత్ర?
కరోనా వల్ల తెలంగాణ గత నాలుగు నెలల్లో దాదాపు రూ.8వేల కోట్లు (34%ఆదాయం) కోల్పోయిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన సెస్‌, ఇతర నిధులను విరివిగా ఇచ్చి ఆదుకోవాలన్నారు. అయి తే దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు హక్కుగా ఇవ్వాల్సిన నిధులను ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం ఇప్పటికైనా దిగిరాకపోతే పార్లమెంట్‌లో నిలదీస్తామన్నారు.

దొందూ దొందే
యూపీఏ హయాంలో ‘సెంట్రల్‌ సేల్స్‌ టాక్స్‌’లో (సీఎస్టీ) తెలంగాణ చేరినప్పుడు నష్టపరిహారం మొత్తం ఇస్తామని నాటి ఆర్థికశాఖ మంత్రి చిదంబరం హామీ ఇచ్చారని హరీశ్‌రావు గుర్తుచేశారు. రాష్ర్టానికి రూ.5,604 కోట్ల పరిహారం రావాల్సి ఉండగా, రూ.1,957 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం రూ. 3,647 కోట్లు ఎగ్గొట్టిందన్నారు. జీఎస్టీలో చేరాలని ఎన్డీయే ప్రభుత్వం కోరినప్పుడు గత అనుభవాలను వివరించి ‘మిమ్మల్ని ఎలా నమ్మాలి?’ అని అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ప్రశ్నించారని తెలిపారు. దీనికి సమాధానంగా ‘మేము చట్టం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా పరిహారం వస్తుంది’ అని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడు హక్కుగా రాష్ర్టాలకు రావాల్సిన వాటాను తగ్గించి చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.

కేంద్రానికే అవకాశాలు ఎక్కువ
సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ ధ్య సమానత్వం ఉండాలని హరీశ్‌రావు చెప్పారు. కానీ, ఎఫ్‌ఆర్బీఎం పరిమితి రాష్ర్టాలకు 3 శాతమే ఉండగా, కేంద్రానికి 5 శాతంగా ఉన్నదన్నారు. దీనిని ఎప్పుడైనా, ఎంతైనా పెంచుకునే అవకాశం కూడా కేంద్రం చేతిలోనే ఉన్నదన్నారు. ఎఫ్‌ఆర్బీఎం అప్పు లు, రాష్ర్టాల నుంచి వచ్చిన సెస్సులు, ఇతర మార్గా ల్లో కేంద్రానికి భారీగా నిధులు వస్తాయని చెప్పారు. ఉదాహరణకు ఇటీవల అంతర్జాతీయంగా చమురు దరలు తగ్గినా.. కేంద్రం లీటర్‌ డీజిల్‌పై రూ.13 వరకు పెంచడం ద్వారా సర్‌చార్జీ, సెస్సు రూపంలో రూ.లక్ష కోట్లు వచ్చాయన్నారు. కేంద్రం చెప్పినట్టు రాష్ర్టాలు మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకుంటే ఒక్కోచోట ఒక్కోరకమైన వడ్డీ ఉంటుందని చెప్పారు.

దేశ ప్రయోజనాలను ఆశించి జీఎస్టీలో చేరాం
జీఎస్టీ ప్రతిపాదించే సమయానికి తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉన్నదని హరీశ్‌రావు గుర్తుచేశారు. 2016-17లో 22% వృద్ధి రేటు సాధించిందన్నారు. ‘ఇలాంటి సమయంలో జీఎస్టీలో చేరడం వల్ల రాష్ర్టానికి కొంతమేర నష్టం తప్పదని తెలిసినా.. దేశ ప్రయోజనాలు, పన్నుల సరళీకరణ, పెట్టుబడులను ఆకర్షించడం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జీఎస్టీకి ఒప్పుకొన్నారు’ అని గుర్తుచేశారు. చట్టం ప్రకారం తెలంగాణ ఇప్పటివరకు రూ.18,032 వేల కోట్లు సెస్‌ రూపంలో కేంద్రానికి చెల్లించిందని, కానీ పరిహారం రూపంలో రాష్ట్రం పొందింది రూ.3,200 కోట్లు మాత్రమేనని తెలిపారు. కరోనా వల్ల ఆదాయం పడిపోయిన సమయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాల్సిందిపోయి సంకుచితంగా ఆలోచిస్తున్నదని మండిపడ్డారు. జీఎస్టీలో చేరకపోయి ఉంటే రాష్ర్టానికి అదనంగా రూ.25వేల కోట్లు వచ్చి ఉండేవని హరీశ్‌ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat