ఆ లేఖను ముఖ్యమంత్రికి ముడిపెట్టడం నవ్వు తెప్పించింది..!
**********************************
బిజెపి నేత సునీల్ థియోధర్ కి భూమన లేఖ
*******************************##
శ్రీ సునీల్ థియోధర్ గారికి నమస్కారం.
మీరు ట్విట్టర్ లో నా గురించి ప్రస్తావించిన విషయం చదివి ఈ వివరణ ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను.
ఒక భారతీయుడిగా, హైంధవ ధర్మం పట్ల అపార నమ్మకం గల భక్తుడిగా భారత ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశ్యం ఏమాత్రం కాదు. అది ఎప్పటికీ నేను చేయను.
నా లేఖలో నేను కోరింది అనారోగ్యంతో ఉన్న ఓ 81 సంవత్సరాల వృద్ధుడి పట్ల జాలి చూపించమని. అంతే కాని ఆయన భావ జాలాన్ని నేను అంగీకరించి కాదు..
53 సంవత్సరాలుగా ఆయుధం పట్టి, సాయుధులై తిరిగే వాళ్ళు సాధించలేని విప్లవం ఓ వృద్ధుడు సాధించగలడా అని తెలియచేసాను కూడా, హింస ఏమాత్రం సమర్థనీయం కాదు అని నా స్పష్టమైన భావన.
యువకుడిగా నేను రాడికల్ భావాలు కలిగిన వ్యక్తిగానే సమాజంలో ప్రచారం జరిగింది. కానీ నా రాజకీయం 1969-70 లలో ఆర్.ఎస్.ఎస్. భావజాలంతో ప్రారంభం
అయింది, ఇది కొందరికే తెలుసు. అప్పటి తిరుపతి ఆర్.ఎస్.ఎస్. ప్రచారకులు శ్రీ బారా గారు (ప్రస్తుతం నెల్లూరు లోని ఆదిత్య విద్యా సంస్థల యజమాని) నా పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారు. ఇది నిజం. .
నేరస్తులను హంతకులను నేను ఎప్పుడూ సమర్థించను. సాయుధ పోరాట మార్గం పట్ల, హింస ఆయుధంగా గల వారిపట్ల నాకు సుముఖత లేదు.
2003 సంవత్సరం లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి మీద నక్సల్స్ దాడి చేసినపుడు తీవ్రంగా ఖండించాము. ఆక్షణాన చంద్రబాబు పార్టీ భయాల్లో మునిగిపోయి వుంటే శ్రీ వై.యస్. రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి తిరుపతి అంబేడ్కర్ విగ్రహం దగ్గర చంద్రబాబు పై జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసిన సంగతి చరిత్ర మరచిపోదు.
భారతదేశపు సనాతన ధర్మాన్ని, విలువలను గౌరవించి ఆచరిస్తానే తప్ప హింసా మార్గాన్ని ఏ మాత్రం సమర్థించను.
2004 సంవత్సరంలో ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో నేను నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున ప్రతినిధిగా చర్చల్లో పాల్గొన్నాననీ ఆ చర్చలు విఫలమైతే మొదటి శిక్ష నాకే వేస్తామని అప్పుడు చర్చల్లో పాల్గొన్న నక్సలైట్లు నన్ను తీవ్రంగా హెచ్చరించారు. నాకు ప్రాణహాని ఉందని డా|| వై.యస్. రాజశేఖర రెడ్డి గారు భద్రత ఏర్పాటు చేశారు కూడా.
హింస, అహింసవాదాల మధ్య ఒక సామరస్యం ఏర్పడి శాంతి నెలకొనాలని ప్రయత్నించానే తప్ప నక్సలైట్లను సమర్ధించి కాదు.
అహింస పరమధర్మం, క్షమ ఉత్తమ గుణం అన్న అత్యుత్తమ హైందవ వాదం నేను బలంగా నమ్ముతాను.
మనిషిని, మానవత్వాన్ని, మానవీయ విలువలను ప్రేమిస్తాను.
పదవుల కోసం వంగి బ్రతకటం కంటే ఔన్నత్యం కోసం అసువులు బాయటమే నిజమైన మూర్తిమత్వం అన్నది నేను నేర్చుకొన్న జీవిత తొలిపాఠం.
అనారోగ్యంతో ఉన్న ఓ 81 సంవత్సరాల వృద్దుడిపై జాలి చూపించమని కోరడం నేరం అని మీరు భావిస్తే ఏం చెప్పను, నమస్కరించటం తప్ప.
46 సంవత్సరాల క్రితం వరవరరావు గారు, నేను, భారత ఉప రాష్ట్రపతి గారు జైలులో కలిసి ఉన్నాం కాబట్టి నేను ఉప రాష్ట్రపతి గారికి వ్యక్తిగతంగా లేఖ రాసాను.
నేనే కాదు దేశంలోని ఎందరో కవులు, రచయితలు, మేథావులు కూడా వరవరరావును విడుదల చేయమని బహిరంగ లేఖలు రాశారు. వారందరు హింసావాదాన్ని సమర్థించే వారు కాదే. లేఖ రాశారు కాబట్టి వారందరినీ దేశబహిష్కారం చేయమని కోరడం న్యాయంగా ఉంటుందా.
తరతరాల భారతీయ సంస్కృతి నేర్పిన క్షమాగుణం వైపు, న్యాయం వైపు, ధర్మం వైపు, మనిషి వైపు నిలబడడం మీ దృష్టిలో నేరం అయితే, ఆ నేరం నేను నిరంతరం చేస్తూనే వుంటాను. మిత్రమా!
భారత ప్రధానిపట్ల నాకు అపార గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నాయి. ఆయన మనందరి అభిమాన నాయకుడు.
నా వ్యక్తిగత అభిప్రాయానికి, మా ముఖ్యమంత్రి గారితో మీరు ముడి పెడుతూ ట్విట్టర్లో రాయడం బాధ కలిగించింది, నవ్వూ తెప్పించింది.
చివరగా శత్రువును చంపడం కాదు, క్షమించడం పెద్ద శిక్ష అని నమ్ముతాను. ఆపై మీ విజ్ఞత.
మీ…భూమన కరుణాకర్ రెడ్డి, శాసన సభ్యులు, తిరుపతి