వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు తిరగరాస్తోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలకుతోడు సాగునీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది.
గతేడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. ఈ సీజన్‌లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగటంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 36.01 శాతం పెరుగుదలతో రెండోస్థానంలో జార్ఖండ్ ఉండగా, 35.14 శాతం పెరుగుదలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది.
దేశవ్యాప్తంగా పంటల సాగును గతేడాదితో పోలుస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదికను వెలువరించింది. 2019-20 వానాకాలం సీజన్‌లో 92.139 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి.
ఈ సీజన్‌లో 126.179 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాదితో పోలిస్తే 34,03,994 ఎకరాల సాగు విస్తీర్ణం రాష్ట్రంలో పెరిగింది. ఈ పెరుగుదల శాతం 36.94 శాతం ఉండటం గమనార్హం.