గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో డిసెంబరు నాటికి 85 వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) చెప్పారు. నగరంలో రూ.9,700 కోట్లతో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు.
వీటిలో సింహభాగం ఈ సంవత్సరాంతానికి ప్రజలకు అందజేస్తామని చెప్పారు. గృహ నిర్మాణ శాఖతో చర్చించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. దేశంలో మరే మెట్రో నగరంలో జరగని విధంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణం చే పట్టినట్లు చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రి బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.