ప్రస్తుత 2020-21 విద్యా సంవత్సరాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది. ఇంజినీరింగ్, బీఫార్మసీ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేపట్టనుంది.
ఈ మేరకు విద్యా సంవత్సరం షెడ్యూల్‌ను విడుదల చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.మంజూర్ హుస్సేన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూజీ, పీజీ విద్యార్థులందరికీ అదే రోజు నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభమవుతాయి.
మొదటి సెమిస్టర్ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నవంబరు కల్లా పరిస్థితులు చక్కబడితే తరగతి గది బోధనకు శ్రీకారం చుట్టే వీలుంది.
ప్రతి సెమిస్టర్‌లో రెండు విడతల్లో ఎనిమిదేసి వారాల చొప్పున 16 వారాల పాటు తరగతులు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ల్యాబ్‌ల ఆధారిత ప్రయోగాలు సాధారణ పరిస్థితులు వచ్చాకే నిర్వహిస్తారు.