దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గాయి. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 57,981 మంది వైరస్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నెల 11వ తేదీన 53 వేల కేసులు రాగా.. తర్వాత ప్రతి రోజు 60 వేలు దాటాయి.
కొత్తగా బాధితుల సంఖ్య తగ్గింది. అయితే, మరణాలు మాత్రం 941 నమోదయ్యాయి. మరోవైపు దేశంలో పరీక్షల సంఖ్య 3 కోట్లు దాటినట్లు కేంద్రం ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 57,584 మంది కోలుకున్నట్లు తెలిపింది.
దీంతో మొత్తం రికవరీలు 19 లక్షలు దాటాయి. రికవరీ రేటు 72.51కి చేరింది. దేశంలో ప్రస్తుతం 6.76 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. మరణాల రేటు 1.92కి తగ్గిందని వివరించింది.