భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో శనివారం ప్రధాని మోదీ దేశీయంగా తయారయ్యే టీకాల గురించి ప్రస్తావించారు. వాటి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
‘ప్రతి ఒక్కరు కరోనా వైరస్ టీకా కోసం ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు కంపెనీలు తమ టీకాలకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయని మీకు తెలియజేయాలను కుంటున్నాను. మన నిపుణులు, శాస్త్రవేత్తలు వాటికి ఆమోదం తెలపగానే, భారత్‌లో తయారు చేసే కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తుంది.
ప్రతి భారతీయుడికీ టీకా అందించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను మేం సిద్ధం చేశాం’ అని ప్రధాని వెల్లడించారు. అలాగే కరోనా వైరస్‌పై ముందుండి పోరాటం చేస్తోన్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల సేవలను ఆయన ప్రశంసించారు.