మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. నిన్న విజయవాడలో కరోనా బాధితులు ఐసోలేషన్ చికిత్స పొందుతున్న హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది.
ఆయా హోటళ్లతో పాటు అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. తాజా అగ్ని ప్రమాదాల సంఘటన నేపథ్యంలో అన్ని ఆస్పత్రులు/కోవిడ్ కేర్ సెంటర్లు (హోటళ్లు) అగ్ని ప్రమాద నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన అన్ని ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల (హోటళ్ల)కు ఆదేశాలు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా హోటళ్లు ఏ మేరకు అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారన్న దానిపైనా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేయాలని యోచిస్తుంది