కరోనా ప్రభావంతో కొన్ని మాసాలుగా తారలందరూ కెమెరాలకు దూరమైపోయారు. ఇటీవల లాక్డౌన్ నిబంధనల సడలింపుతో ప్రభుత్వ ఆంక్షల నడుమ కొన్ని సినిమాల చిత్రీకరణలు మొదలయ్యాయి. అయితే అగ్ర కథానాయికలెవరూ ఇప్పటివరకు చిత్రీకరణలో పాల్గొనలేదు.
పంజాబీ భామ పాయల్‌రాజ్‌పుత్ లాక్డౌన్ విరామానంతరం తొలిసారి కెమెరా ముందుకొచ్చింది. ఓ పంజాబీ పాటకు సంబంధించిన షూటింగ్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకొచ్చాను.
ఆనందభాష్పాలతో హృదయం ఉద్వేగభరితంగా మారింది. తిరిగి వృత్తిలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నా. ఇప్పుడు మనసంతా ప్రశాంతంగా అనిపిస్తోంది’ అని పేర్కొంది.
‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ సొగసరి ‘వెంకీమామ’ ‘డిస్కోరాజా’ సినిమాలతో అగ్రనాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. మాతృభాష పంజాబీలో కూడా సినిమాల్ని అంగీకరిస్తోంది.