భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి.
భారత్లో ఒక్కరోజులోనే 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది.
మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13లక్షల 78వేల మంది కోలుకోగా, మరో 6లక్షల 7వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.
నిన్న ఒక్కరోజే దాదాపు 50వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 68శాతానికి పెరిగింది. కొవిడ్ మరణాల రేటు 2.07శాతంగా ఉంది.