వాస్తవం ఇదీ
కాంగ్రెస్ నిజంగా ఆ ఆలోచన చేసిందా? చేస్తే రాధాకృష్ణకు వచ్చి చెప్పిందా? రాధాకృష్ణ జూన్ 16న ప్యాకేజీ పాట పాడితే.. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా. ప్యాకేజీ ప్రకటనలంటూ అబద్ధాలకు అక్షర రూపాన్నిచ్చి రాధాకృష్ణ ఎంతోమంది అమాయక తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యాడు.
2014, ఆగస్టు 3 – కొత్త పలుకు
గత నెలలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం తర్వాత 43 నిర్ణయాలు తీసుకున్నామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా ఇంతవరకు అమలు కాలేదు. బారెడు చెప్పి మూరెడు చేయడం అలవాటుగా చేసుకున్నారు. పోలీసులకు ఇన్నోవా వాహనాలు, కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.50వేలు ఇస్తామన్నారు.
వాస్తవం ఇదీ
ఆ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే 2009 నుంచి రైతులకు పెండింగులో ఉన్న రూ.480.43 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం అందించింది. 12.64 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. పోలీసు లాఠీ దెబ్బలు తప్ప ఎర్రజొన్న రైతులను కనికరించకుండా ఉమ్మడి పాలకులు పెండింగులో పెట్టిన రూ.9.50 కోట్ల బకాయిల్ని నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతులకు చెల్లించినదీ ఈ మంత్రివర్గ సమావేశంలోని నిర్ణయం ప్రకారమే. ఏ రాష్ట్ర చరిత్రలోలేని విధంగా తెలంగాణలో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఇన్నోవా వాహనాన్ని ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఇక.. కల్యాణ లక్ష్మి పథకం ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. రూ.50 వేల ఆర్థిక సాయంతో మొదలైన ఈ పథకం ఇప్పుడు లక్ష నూటపదహారు రూపాయలకు పెంచారు.