రాయలసీమ ప్రాంతం నుంచి ఎందరో అవిభజిత, విభజిత రాష్ట్రాన్ని పాలించారు. నిత్యం కరువుతో అల్లాడే ఆ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకున్నామని హడావిడి చేశారు. అయితే వారిలో ఆ ఇద్దరే ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారు. ఒకరు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. మరొకరు ఆయన తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఈ ప్రాంతం రాజకీయంగా ఎంతో అండగా నిలిచింది. తమను రాజకీయంగా నిలబెట్టిన ప్రాంతనికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఇద్దరూ ముందుకు నడిచారు. తన తండ్రి చూపిన బాటలోనే నడవాలని ఆలోచనతో జగన్ ప్రస్తుతం ముందుకు వెళుతున్నారు. అపుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం వాళ్ళ రాయలసీమ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాగునీటి రంగంలో సాధించింది. ఇపుడు జగన్ మోహన్ రెడ్డి రాయసీమలోని కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూర్ల తో పాటు, కోస్తా జిల్లాలు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులు లబ్ది పొందేలా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం కు శ్రీకారం చుట్టారు. ఈ పథకం ఏలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కొర్పొరేషన్ ను కూడా జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు.
రాయలసీమకు తలాపున కృష్ణ, హంద్రీ, నీవా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా నిత్యం కరువుతో అల్లాడేది. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గాలేరు నగరి, హంద్రీ నీవా వంటి పధకాలను చేపట్టి అక్కడి ప్రజల మనస్సులో స్థానం సంపాదించారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మరోఅడుగు ముందుకు వేసి ఈ ప్రాంత రూపు రేఖలు మార్చే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని చేపట్టారు. అంతర్ రాష్ట్ర వివాదాలు , సాంకేతిక సమస్యలు అధిగమిస్తూ ప్రస్తుతం టెండర్లు పిలిచే దశకు ఆ ప్రాజెక్టును జగన్ చేర్చారు.
రాష్ట్రంలో ఇదే పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్….
ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తిపోతల పధక నిర్మాణానికి జగన్ సన్నద్ధం అయ్యారు. తెలంగాణాలో రోజుకు మూడు టి ఎం సి ల నీటిని ఎత్తిపోసేలా కె ఎల్ ఐ పీ ని నిర్మాణం చేపట్టింది. రెండు టి ఎం సి ల నీటిని ఇప్పటికే ఈ పథకం ద్వారా పంపింగ్ చేస్తున్నారు. మూడో టి ఎం సి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఏ పీ లో చేపట్టే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకేసారి మూడు టి ఎం సి ల నీటిని పంపింగ్ చేసేలా డిజైన్ చేశారు. దీన్ని కర్నూల్ జిల్లా సంగమహేశ్వరం వద్ద నిర్మించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం హంద్రీ నీవా ను భారీ ఎత్తిపొతల పథకం గా లెక్కిస్తున్నారు.
దీని ద్వారా ఏడాదికి 40 టి ఎం సి ల నీటిని మాత్రమే పంపింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా పట్టిసీమ, కొండవీటి వాగు, పురుషోత్తపట్నం వంటి ఎత్తిపోత ల పథకాలు ఉన్నా వాటికి భిన్నమైంది రాయలసీమ పథకం . ఇది పూర్తి అయితే రాయలసీమ లోనే మెజారిటీ ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించి కరువును శాశ్వతంగా పారదోలే అవకాశాలు మెండుగా ఉన్నాయ్.
ఈ డిమాండ్ ఎప్పటిదో….
రాయలసీమకు కృష్ణ జలాలను తరలించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రాంత నేతలు ఈ డిమాండ్ తో ఏంటో కాలం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల మనసు తెలిసిన రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్ధ్యం 44 వేళా క్యూసెక్కులకు పెంచినా ఈ ప్రాంత ప్రజల సమస్యలు పూర్తిగా తీరలేదు. సీమను ఆనుకొని ఎన్ని నదులున్న ఈ కరువు, కాటకాలు ఏంటి అని ఈ ప్రాంత ప్రజలు నిత్యం ఆందోళన చెందుతున్న సమయంలో రాయలసీమ ప్రాజెక్ట్ జగన్ మదిలో మెదిలింది. వెంటనే అమలుకు జగన్ సిద్ధం అయ్యారు.
శ్రీశైలం వరద జలాల్లో 14 టి ఎం సి లను రాయలసీమ కు వినియోగించాలి. అంటే మొత్తం నీటిని తరలించేందుకు రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడు సామర్ధ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. దీని వల్ల సీమలో శ్రీశైలం వరద జలాల వినియోగం గణనీయంగా పెరిగింది. గత ఏడాది 179.30 టిఎంసిల నీటిని రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నై నగరాలకు మళ్లించారు. అయినప్పటికీ సీమలో నీటి సమస్య పరిష్కారం కాక పోగా దీని సామర్ధ్యం సరిపోకపోవడం తో వరదల సమయంలో నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది.
శ్రీశైలం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని తరలించాలి. గత రెండు సంవత్సరాలు మినహా మిగిలిన ఏ ఏడాది కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు మళ్లించలేకపోయారు. 2004 నుంచి లెక్కలను పరిశీలిస్తే ఈ విష్యం తేటతెల్లం అవుతుంది . 2019-20 సంవత్సరంలో శ్రీశైలంకు 6 విడతల్లో వరదలు వచ్చాయి. 889 టిఎంసిల నీటిని స్పిల్ వే నుంచి కిందకు విడుదల చేశారు. అందులో 600 టిఎంసిల నీరు నిరుపయోగంగా సముద్రంపాలు అయ్యింది. అదే సమయంలో రాయలసీమలోని 4 జిల్లాలకు అవసరమైన నీరు అందలేదు. 120 టిఎంసిల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఈ నాలుగు జిల్లాలోనూ ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం పోతిరెడ్డిపాడు సామర్థ్యం అవసరమైనంత స్థాయిలో లేకపోవడమే.
శ్రీశైలం నుంచి 7000 క్యూసెక్కుల నీటిని జలాశయంలో నీటి మట్టం 854 అడుగుల దాటిన తరువాత వినియోగించాలి. అదే విధంగా నీటి మట్టం 881 అడుగులు మించిన తరువాత 44 వేల క్యూసెక్కులను పోతిరెడ్డిపాడులోకి అనుమతించాలి. అయినా కేటాయించిన వాటాను సకాలంలో వినియోగించుకోవడం సాధ్యం కావడం లేదు. సంవత్సరం మొత్తానికి 15 నుంచి 20 రోజులు మాత్రమే వరద నీటిని వినియోగించుకోవడం వీలవుతోంది. ఫలితంగా వరద నీరు సైతం సీమ జిల్లాలకు అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు శ్రీశైలం జలాశయంలో పూడిక పెరిగిపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయింది. వాస్తవానికి 308 టిఎంసిల జలాలు ప్రాజెక్ట్ నిండినప్పుడు ఉండాలి. కానీ 215 టిఎంసిలు మాత్రమే ఉంటోంది. అంటే దాదాపు 93 టిఎంసిల నీరు నిల్వ లేకుండ నిరుపయోగం అవుతోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక శరణ్యమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలంచి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించారు. ఇంజనీరింగ్ నిపుణులు ఈ పథకం పై అధ్యయనం చేసి ఆచరణలో సాధ్యమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
రోజుకు మూడు టి ఎం సి లు ఒక వేళ అవసరమైతే ఎనిమిది టి ఎం సి ల నీటిని ఎత్తిపోసేలా సంగమహేశ్వరం వద్ద భారీ ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారు. ఈ పంపింగ్ కేంద్రం సామర్ధ్యం 397 మెగావాట్లు. ఒక్కో మెషిన్ సామర్ధ్యం 33. 04 మెగావాట్లు . రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్.ఎల్.సి – రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు 3 టిఎంసిల (34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి క్రిష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ లోకి నీటిని విడుదల చేస్తారు. కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇలా పంప్ చేసిన నీటిని 125 మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తారు.
ఆ తరువాత డెలివరీ సీస్టర్న్ నుంచి నీరు విడుదలై 22 కిలోమీటర్ల మేర ప్రవహించి పోతిరెడ్డిపాడుకు సమీపంలో 4-5 కిలోమీటర్ల మద్య ఎస్ఆర్ఎంసిలో కలుస్తుంది. అక్కడి నుంచి నీరు తెలుగు గంగ, ఎస్.ఆర్.బి.సి, కెసి కాలువలకు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తో పాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5 కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12 మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి.
ఈ పంప్ హౌస్ లోని మెషిన్ల ను రన్ చేసేందుకు 397 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ట్రం లో మరెక్కడా లేదు. ఏపిలో ఇదే అరుదైనది ప్రాజెక్ట్ నిర్మాణం, కొత్తకాలువ తవ్వడానికి 12 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం అంచనా వేసింది.