మీరెప్పుడైనా కాళేశ్వరం గుడి చూసిండ్రా?… ఉద్యమంలో తొలినాళ్లలో మహదేవపూర్‌కు పోయినప్పుడు, ఒక రైతు కేసీఆర్‌ను అడిగిన ప్రశ్న ఇది. లేదని చెప్పగానే, ఒక ఎడ్లబండి కట్టుకొచ్చి, దాన్లో కేసీఆర్‌ను కాళేశ్వరానికి తీసుకుపోయాడు. “ఇక్కడ గంగలో సంగమం ఉంటది. స్నానం చేస్తే పుణ్యం. చేస్తరా?” అని తనే అడిగాడు. సరేనంటే అదే బండి మీద గోదావరిలోకి తీసుకుపోయాడు. దాదాపు కిలోమీటరున్నర పోతేగానీ సంగమం రాలేదు. అక్కడ ప్రాణహిత నుంచి పారుతున్న నీళ్లు మోకాలు లోతున్నాయి. పైన ఎండ దంచి కొడుతున్నది. ఒడ్డుకొచ్చేసరికి మళ్లీ చెమటతో తడిసిపోవడమే! “గంగ పక్కనే ఉన్న ఇంతటి క్షేత్రంలో గుడి దగ్గర స్నానాలకు నీళ్లు లేకపోవడమా? ఈ ఆంధ్రా పాలకులు గోదావరికి అడ్డంగా ఒక చెక్‌డ్యాం కట్టినా గుడిదాకా నీళ్లు నిలబడేవి కదా” అనుకున్నారు కేసీఆర్. “కాళేశ్వరుడి దయ వల్ల తెలంగాణ వస్తే, ఇక్కడొక బ్యారేజీ కట్టిస్తా” అని నీళ్లలో మునుగుతూ మొక్కుకుని, గుళ్లో దండం పెట్టి, మళ్లీ బండి ఎక్కారు. పక్కనే గోదావరి ఉన్నా పొలాలకు నీళ్లు లేవంటూ దారిలో ఆ రైతు తన గోస చెప్పుకున్నాడు. ఎండిన పొలాలను చూపించాడు.
“కృష్ణమూర్తిగారూ, అప్పుడు ఆ రైతు కాళేశ్వరానికి తీసుకుపోవడం నాలో ఒక సంకల్పానికి కారణమైంది. నేను బ్యారేజీ కడదామనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల తెలంగాణ వచ్చింది. ఇంత పెద్ద ప్రాజెక్టు తయారైంది” అంటూ కేసీఆర్.. ఘాట్ మెట్ల మీద నిలబడి, నిండు గంగకు దండం పెట్టి, ఆ నీళ్లను అందరిమీదా చల్లారు. చిల్లర పైసలు తీసి తాను వేసి, మాతోనూ నదిలో వేయించారు. అక్కడున్న మహిళా అధికారులతో పసుపు కుంకుమ చీర సారె గోదావరికి సమర్పింపజేశారు. ఐఏఎస్ అధికారులు సహా అక్కడున్నవారంతా భక్తితో కళ్లు మూసుకుని, గోదావరికి దండం పెట్టుకున్నారు. తన్మయంతో నీళ్లలో నిలుచున్న నావద్దకు ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే వచ్చి, “ నామీద గంగ పడలేదు. కొంచం చల్లరూ” అని అడిగి మరీ చల్లించుకున్నారు. తిరిగి వస్తున్నప్పు డు, చాపర్‌ను పైకీ కిందకి పోనిస్తూ, నిండుగా నిండిన బ్యారేజీలను చూపిస్తూ, హెలికాప్టర్ రొదలో వినపడదని తెలిసి కూడా, ఆ నీళ్లు తెలంగాణలో ఎక్కడెక్కడిదాకా పారతాయో చెప్తూ సంబురపడిపోయారు కేసీఆర్.
పెద్ద వట వృక్షమైనా చిన్న విత్తులోనే దాగి ఉంటుంది. శిఖరాగ్రానికి ప్రయాణం కూడా తొలి అడుగుతోనే మొదలవుతుంది. అలాగే ఎంత పెద్ద పనికైనా మూలం చిన్న ఆలోచనే. కావాల్సిందల్లా థింక్ బిగ్ అన్న దృక్పథమే! “ప్రపంచంలో ఏ నిర్మాణమైనా రెండు సార్లు జరుగుతుంది. ఒకటి మన ఆలోచనలో కల్పనగా, రెండోది భౌతికంగా” అంటారు నా మిత్రుడు, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్‌రెడ్డిగారు. మన సంకల్పంలో నిజాయతీ ఉంటే అది ఎంతటి అవరోధాన్ని దాటుకుని అయినా సాకారమవుతుంది. తెలంగాణ రావడమూ, కాళేశ్వరం పూర్తి కావడమూ ఇందుకు నేటి నిదర్శనాలు. తాను తెచ్చిన తెలంగాణ, తాననుకున్న తెలంగాణ ఎలా ఉండాలన్న దానిపై కేసీఆర్‌కు ఒక కల ఉంది. ఒక కల్పన ఉంది. ఒక విజువలైజేషన్ ఉంది. సవాళ్లు, సంక్షోభాలే సమస్యలకు పరిష్కారాలు చూపిస్తాయన్నట్టు, సుదీర్ఘ ప్రజా జీవితంలో, తాను గమనించిన తెలంగాణ వెతల నుంచే కేసీఆర్ పరిష్కారాలు వెతికారు. ఊరూరా ఊరేగిన ఆర్వో వాటర్ క్యాన్ల నుంచి భగీరథ ఉద్భవిస్తే, పూడుకుపోయి నెర్రెలిచ్చిన చెరువుల్లో కాకతీయ కనిపించింది. ఉరితాళ్లకు వేలాడిన రైతు కుటుంబాల రోదన లోంచే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు వెలిగాయి. ర్యాంకుల పోటీలో వెనకబడిన బడుగు పిల్లల ఏడుపులోంచి గురుకులం గుర్తుకొచ్చింది. కన్న బిడ్డ కావాలంటే కడుపుకోత తప్పని బాలింత బాధ నుంచి ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధి, కేసీఆర్ కిట్ తయారైంది. కన్నబిడ్డకూ భారమవుతున్నామనే ముసలోళ్ల అరుగు ముచ్చట్లోంచి పెన్షన్ పెరిగింది. ఊళ్లలో, ఇళ్లలో కోతుల వీరంగం నుంచి హరితహారం మొలిచింది. తెలంగాణలో వచ్చిన ప్రతి కొత్త పథకానికి మూలం ఇక్కడి ప్రజల గోస. దాన్ని ఎలాగైనా తీర్చాలన్న ధ్యాస!
ఒక మూఢ నమ్మకం మంచికి దారితీస్తే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? ఆరోపణలు చేస్తున్న నాయకుల్లో ఏ ఒక్కరైనా తన ఇంటిని వాస్తు విరుద్ధంగా కట్టుకున్నారా? కుటుంబ క్షేమం, పిల్లల మంచి కోసం వారలా చేసినపుడు తెలంగాణ జాతి జనుల క్షేమం కోసం కేసీఆర్ చేస్తే తప్పేమిటి?
ఒక్కసారి గతానికి, ఆరేళ్ల క్రితానికి వెళ్లి చూడండి. అప్పుడు మన జీవితాలు ఎలా ఉండేవి? ఇప్పుడెలా ఉన్నాయి! తెలంగాణలో ఇన్ని, ఇవన్నీ జరుగుతాయని అనుకున్నామా? అదే నేల, అదే సిబ్బంది, అదే జనం, అవే వనరులు… కానీ పరిస్థితి మారిందా లేదా? పాడుబడ్డ పల్లెకు ఇప్పుడు కొత్త కళ అబ్బిందా లేదా? మార్పు ఎప్పుడూ కొంచం కష్టంగానే ఉంటుంది. కానీ మారకపోతే బతకలేం. మనుషులు రెండు రకాలు. యథాతథవాదులు. సంస్కరణవాదులు. యథాతథవాదులు మార్పును కష్టంగా భావిస్తారు. అందుకే దానికి సిద్ధపడరు.అంగీకరించరు. అంతేకాదు; మార్పులు చేయాలనుకునే సంస్కరణవాదుల్లో తప్పుల్ని వెతకడం ద్వారా మార్పును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. పీవీ నరసింహారావు సంస్కరణ ఇది. చేపట్టిన ప్రతి పదవితోనూ ఆయన మార్పులకు ప్రయత్నించారు. నాడు ఆయననూ కులం-కుట్ర అని వేయించుకు తిన్నారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నదీ ఇలాంటిదే. తెలంగాణ అంటే కేసీఆర్‌కు పిచ్చి అభిమానం, తెలంగాణ ఆయనకు ఒక వ్యసనం. ఈ వయసులో ఆయనకు తెలంగాణను మించి మరో పనిగానీ, ఆలోచనగానీ లేదు. తెలంగాణను మార్చాలని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే, కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇందుకు వారి గత సావాస దోషాలు కారణం కావచ్చు! మార్పును అంగీకరించలేని మనస్తత్వం కావచ్చు.
కొత్త సచివాలయమే ఇందుకు ఉదాహరణ. మూఢ నమ్మకాల వల్లే ఆయన సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారన్నది వారి అభ్యంతరం. నిజానికి సచివాలయం అనేది ప్రాంత ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అనేక రాష్ర్టాలు అందుకే భవ్యమైన భవనాలు కట్టుకున్నాయి. ప్రధాని మోదీ కూడా అద్భుతమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించబోతున్నారు. రాజుల కాలం నుంచి నేటి దాకా భారీ నిర్మాణాలు జాతి ప్రాభవ చిహ్నాలు. కేసీఆర్ కూడా తెలంగాణ వైభవాన్ని చాటడానికి, తెలంగాణను అరిగోస పెట్టిన వలస పాలన అవశేషాలను చెరిపివేయడానికి కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు. అది తెలిసి కూడా కొందరు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. సిద్ధిపేట ప్రాంతానికి చెందిన నేను 1992 నుంచి కేసీఆర్‌ను దగ్గరగా చూస్తున్నాను. నా 25 ఏళ్ల జర్నలిస్టు జీవితంలో వ్యక్తిగతంగా ఇంత దారుణమైన దాడి ఎదుర్కొన్న నాయకుడు మరొకరు లేరు. రాష్ట్ర పూర్వవైభవాన్ని పునరుజ్జీవింప చేయడం ప్రజలు, ఉద్యోగులకు సౌకర్యం మెరుగుపరచడమే కొత్త సచివాలయ ఉద్దేశం. కానీ కొందరికి అందులో మూఢ నమ్మకం కనిపిస్తున్నది. అయినా నాకు తెలియక అడుగుతాను. ఒక మూఢ నమ్మకం మంచికి దారితీస్తే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? ఆరోపణలు చేస్తున్న నాయకుల్లో ఏ ఒక్కరైనా తన ఇంటిని వాస్తు విరుద్ధంగా కట్టుకున్నారా? కుటుంబ క్షేమం, పిల్లల మంచి కోసం వారలా చేసినపుడు తెలంగాణ జాతి జనుల క్షేమం కోసం కేసీఆర్ చేస్తే తప్పేమిటి? తెలంగాణ ఇస్తే కాళేశ్వరంలో బ్యారేజీ కట్టిస్తా అని మొక్కడం మూఢ నమ్మకమైతే, ఆ మూఢ నమ్మకం మంచిదే.
చిల్లర పైసలు వేసి, చీర సారె పెట్టి నదిని పూజించడం ఒక మూఢ నమ్మకమైతే ఆ మూఢ నమ్మకం మంచిదే. తన ప్రజలు, తన రాష్ట్రమూ సుభిక్షంగా ఉండాలని చండీయాగం చేయడం మూఢ నమ్మకమైతే, ఆ మూఢ నమ్మకం మంచిదే. తెలంగాణను చల్లగ చూడాలని లక్ష్మీ నరసింహుడికి భవ్యమైన గుడి కట్టడం మూఢ నమ్మకమైతే, ఆ మూఢ నమ్మకం మంచిదే. తెలంగాణ వస్తే మొక్కులిస్తానని మొక్కుకోవడం, వచ్చినాక ఇవ్వడం మూఢ నమ్మకమైతే ఆ మూఢ నమ్మకం మంచిదే. రాష్ట్ర ప్రజల మేలు కోసం, వాస్తు మేరకు కొత్త సచివాలయం కట్టడం మూఢ నమ్మకమైతే ఆ మూఢ నమ్మకం మంచిదే. గాఢంగానో, మూఢంగానో నమ్ముకునే ప్రజలు గెలిపిస్తున్నారు కదా…వారి మంచి కోసం కొన్ని మూఢ నమ్మకాలు పాటిస్తే తప్పేంటి? మన సంస్కృతిని, విలువలను ధ్వంసం చేసే పనికిరాని ప్రగతిశీల ఆలోచనల కంటే కొన్నిసార్లు మూఢ నమ్మకాలే మంచివి. తెలంగాణపై, ఇక్కడి ప్రజలపై ఉన్న మూఢ నమ్మకమే కేసీఆర్‌తో ఈ పనులన్నీ చేయించింది. చేయిస్తోంది. ‘అన్నింటికీ మందులుండవు. ఇప్పటికి మీ మూఢ నమ్మకాలే మీకు మందు’ అని కదా కరోనా శకం ఇస్తున్న సందే శం! అందరూ పోపుల పెట్టె కషాయాలు గట్రా శ్రద్ధగా, మూఢ నమ్మకంతో తాగుతున్నారు కదా! తప్పదు మరి!!