వినాయక చవితి పండుగ అనగానే హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్ గణపతి గుర్తుకు వస్తాడు. ప్రతి ఏడాది ఈ భారీ వినాయకుడిని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతుంటారు.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్టించాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని కమిటీ భావిస్తోంది.
ఈసారి ధన్వంతరి పేరుతో గణేషుడి ప్రతిమను ప్రతిష్టించనున్నారు. స్థానికులకు ఆరడుగుల దూరం నుంచి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
మిగతా ప్రాంతాల్లోని భక్తులకు ఆన్‌లైన్‌లో దర్శనం కల్పించాలని ఉత్సవ కమిటీ భావిస్తోంది. గతేడాది 63 అడుగుల ఎత్తులో ద్వాదశ ఆదిత్య మహాగణపతిని ప్రతిష్టించారు. విగ్రహం తయారీ కోసం హైదరాబాద్ సిటీ కమిషనర్‌ను సంప్రదించి అనుమతి తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.