ప్రధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనాపై పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్-2 దశలోకి ప్రవేశించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరం వచ్చే మాసంలోకి కూడా ఎంటర్ అయ్యామన్నారు. ఇలాంటి సందర్భంలో దేశ ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా మృతుల నివారణలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. లాక్‌డౌన్ సరైన సమయంలో చేపట్టడం, ఇతర నిర్ణయాల వల్ల లక్షలాది మంది భారతీయుల ప్రాణాలను రక్షించుకోగలిగామన్నారు.
అన్‌లాక్-1 దశ నుంచి కొంత మార్పులు చోటుచేసుకున్నట్లు చెప్పారు. జనం నిర్లిప్తంగా ఉంటున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎక్కవ జాగ్రత్త పడాల్సిన దశలో.. జనం పట్టింపులేనట్లుగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. లాక్‌డౌన్ వేళ నియమాలను కఠినంగా పాటించామన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు, ప్రజలు.. అలాంటి తరహా నియమాలు పాటించాలన్నారు. విశేషంగా కంటేయిన్‌మెంట్ జోన్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నారు. ఎవరు నియమావళిని ఉల్లంఘిస్తున్నారో.. వారిని అడ్డుకోవాలన్నారు. వారికి ఆ పద్ధతులను నేర్పించాలన్నారు.
ఓ దేశ ప్రధానిపై రూ.13000 జరిమానా ఎందుకు వేశారో.. మీరు చూసి ఉంటారని, ఆయన మాస్క్ ధరించకపోవడం వల్ల ఆ ఫైన్ వేశారన్నారు. భారత్‌లోనూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. భారత ప్రధాని అయినా, ప్రజలైనా .. నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు.
జాతిని ఉద్దేశించి మాట్లాడటానికి పూర్వం ఇవాళ ఉదయం ప్రధాని మోదీ .. కోవిడ్19 వ్యాక్సిన్‌పై ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ సమయంలో మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఇది ఆరవసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మే 12వ తేదీన ఆయన చివరిసారి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.