మనం పోగొట్టుకొన్న అడవిని మనమే తిరిగి తెచ్చుకోవాలని.. అందరం కలిసి అడవులను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మనం మేలుకొంటేనే అడవులు బాగవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అడవులు పూర్తిగా అంతరించుకుపోయాయని, తిరిగి ఆ అడవులను పునరుద్ధరించుకోవాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీప్రాంతంలోని అర్బన్ పార్కులో అల్లనేరేడు మొక్కనాటి రాష్ట్రంలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి పార్కును సందర్శించారు. రాష్ట్రంలో కలప స్మగ్లర్ల ఆటలు ఇకపై సాగబోవని.. వారిని ఎవరూ కాపాడలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా హెచ్చరించారు. అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని, కరోనా కారణంగా మూడు నెలలపాటు వేతనాల్లో కోతలు పెట్టినా.. తిరిగి నెలలోపే పుంజుకున్నామని.. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలు ఆయన మాటల్లోనే..
ఆ అడవంతా ఏమయినట్లు?
1985 ప్రాంతంలో నర్సాపూర్ అడవిలో సినిమా షూటింగ్‌లు జరిగేవి. ప్రతిరోజూ ఏదో ఓ మూల షూటింగ్‌లు ఉండేవి. ఆ అడవి ఎక్కడికి పోయినట్లు? ఎక్కడ లేకున్నా నర్సాపూర్‌లో వర్షాలు కురిసేవి. కౌడిపల్లిలో బెల్లం గానుగలు నడిచేవి. ఇప్పుడు కౌడిపల్లిలో కరువొచ్చింది. మనం చేతులారా అడవిని పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న అడవినంతా మనమే తెచ్చుకోవాలి. అం దుకు సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఏకంకావాలి. రోజూ ఎవరింటిని వారే ఊడ్చుకోవాలి. మనకు తలనొప్పి వస్తే పక్కవాళ్లు వచ్చి ఊడ్వరు. మనం మేల్కొంటేనే బాగైతయి.
ఇది ఫారెస్టు వాళ్ల బాధ్యత అనుకోకుండా అందరూ కలిసి అడవులను రక్షించుకోవాలి. నర్సాపూర్‌లో కోల్పోయిన 92 వేల ఎకరాల అడవిని, ఫారెస్ట్ సిబ్బంది తిరిగి పునరుద్ధరణతో మొలిపించారు. ఇప్పుడు పాత అడవిలా ముఖం తెలివిలా కనిపిస్తున్నది. ఎంత ధనమున్నా ఆహ్లాదకర పరిస్థితులు లేకపోతే, 55 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే తలుపుతీసి బయటకుపోము. అందుకే ముందుతరాలకు బతికే పరిస్థితి కల్పించాలి. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పుడు భూపాల్‌రెడ్డి హుడాలో ఉన్నాడు. సిద్దిపేటకు హరితహారం అని ప్రోగ్రాం పెట్టుకున్నాం. పదివేల మొక్కలు కావాల్సి వస్తే నేను పదివేల అవతారాలు ఎత్తిన. నర్సరీ ఎక్కడ ఉంటదో తెలియదు అని అన్నారు..