తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా చేపట్టిన కరోనా శాంపిళ్ల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించారు. ఇప్పటివరకు స్వీకరించిన శాంపిళ్లకు సంబం ధించి అన్ని ఫలితాలు ప్రకటించిన తర్వాతే మళ్లీ నమూనాలు స్వీకరించా లని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందుకోసం రెండు రోజులపాటు కరోనా శాంపిళ్ల స్వీకరణకు విరామం ఇచ్చామని.. అయితే, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను ఎక్కువ మొత్తంలో చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈనెల 16 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో భారీగా కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయాలని సూచించారు. పది రోజుల్లో 50వేల పరీక్షలు పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలని స్పష్టంచేశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అనుమానితుల నుంచి నమూనాలు స్వీకరిస్తోంది. అయితే, ప్రభుత్వ ల్యాబ్‌ల సామర్థ్యానికి మంచి శాంపిళ్లను స్వీకరించడంతో వాటి పరీక్షలు పెండింగ్‌లో పడ్డాయి. బుధవారం వరకు దాదాపు 36వేల శాంపిల్స్ సేకరించగా.. 27,747 నమూనాలను పరిశీలించి ఫలితాలు ప్రకటించారు. ఇంకా 8,253 నమూనాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.