మన అధికారం మన చేతిలో ఉంటే ఫలితాలు ఇలా ఉంటాయని అందుకు అభివృద్ధి చెందుతున్న తెలంగాణే నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. సమిష్టికృషితో నర్సాపూర్ అటవీప్రాంతానికి పునర్జీవం లభించిందన్నారు. స్వయంగా కారు నడుపుతూ తాను ఈ అడవుల్లో తిరిగినట్లు తెలిపారు. నర్సాపూర్ నుంచి సంగారెడ్డి, తూప్రాన్, హైదరాబాద్‌కు ఫియెట్ కారులో తిరిగినట్లు చెప్పారు. సినిమా షూటింగ్‌ల కోసం నర్సాపూర్ అటవీప్రాంతాన్నే ఎక్కువగా ఎంపిక చేసుకునేవారన్నారు. నర్సాపూర్ అడవుల్లో చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయన్నారు.
మిషన్ భగీరథతో తెలంగాణలో నీటి సమస్య తీరిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య సైతం తీరిందన్నారు. ఇకముందు తెలంగాణకు విద్యుత్ సమస్య రాదన్నారు. రాష్ట్రంలో నాణ్యమన నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. గత పాలనలో తెలంగాణలోని అడవులన్నీ తరిగిపోయాయన్నారు. కలప దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమన్నారు. కలప స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ఇంటలిజెన్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. అడవులను స్మగ్లర్లకు అప్పగించిన పార్టీలే మళ్లీ విమర్శలు చేస్తున్నాయన్నారు.
ఇప్పుడు తెలంగాణలో అడవుల పెంపకంపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. దేశంలో ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. సంకల్పం ఉంటే అన్ని సమకూరుతాయన్నారు. గ్రామాలకు పూర్వ వైభవం రావాలని సీఎం కేసీఆర్ అన్నారు.