భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ దగ్గర జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సంతోష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలన్నారు. సంతోష్ కుటుంబం బాగోగులను చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. సోమవారం మధ్యా హ్నం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి 3.40 గంటలకు సూర్యాపేటలోని కర్నల్ ఇంటికి వెళ్లిన ముఖ్యమం త్రి కేసీఆర్ ముందుగా సంతోష్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం అమరవీరుడి భార్య సంతోషి, తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శ్రుతిని ఓదార్చారు. సంతోష్ పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్‌తేజను పలుకరించారు. దేశ రక్షణకోసం సంతోష్ ప్రాణత్యాగంచేశారని కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతో కలచివేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం ఇద్దరు పిల్లల కోసం సంతోష్ భార్య సంతోషికి ఆమె పేరిట రూ.4 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందించారు. గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఇల్లుజాగ పత్రాన్ని కూడా ఇచ్చారు. సంతోష్ తల్లిదండ్రులకు కోటిరూపాయల చెక్కును అందించారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎంపీలు సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లిం గయ్య, భూపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ దీపికా యుగంధర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఆర్డీవో మోహన్‌రావు ఉన్నారు..