చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి తెలంగాణ పంట దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా కోటి పదిహేనువేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 64.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక్క మన రాష్ట్రం నుంచే సేకరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సేకరించిన ధాన్యం 31.50 లక్షల మెట్రిక్ టన్నులు కావడం గమనార్హం. క్షుద్ర రాజకీయ పార్టీలు కొన్నింటికి ఈ పరిణామం అర్థం కాదు. తెలంగాణ వ్యవసాయ దిగుబడిలో సాధించిన వృద్ధిని చూసి స్వయంగా ఎఫ్‌సీఐ సీఎండీ అభినందించారు. కరోనా కాలంలో రైతుల చేతుల్లో తమ పంట ప్రతిఫలం నగదు రూపంలో కళకళలాడుతున్నది. ఎంతలో ఎంత మార్పు? ఘోర కరువుకాటకాలకు నిలయంగా పేరుమోసిన తెలంగాణ, ఈ ఆరేండ్లలో ‘భారతదేశ ధాన్యాగారం’ అనిపించుకునే స్థాయికి ఎదిగింది. ఇది అయాచితంగానో, కాకతాళీయంగానో జరుగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో చేసిన కృషి ఫలితంగా తెలంగాణ వ్యవసాయం నేడీదశకు చేరుకున్నది.
ఒకప్పుడు తెలంగాణ వ్యవసాయం స్వయంపోషక వ్యవస్థగా ఉన్నది. రైతులు దేనికోసమూ ఎవరిమీదా ఆధారపడలేదు. విత్తనాలు, ఎరువులూ స్వయంగా తామే తయారుచేసుకున్నారు. కానీ రానురానూ ప్రభుత్వం మద్దతు లేకుండా వ్యవసాయం చేయలేని స్థితికి రైతు నెట్టబడ్డాడు. స్వాతంత్య్రానంతరం రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంనాటికే ఆంధ్రాప్రాంత రైతులకోసం ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయి. కాలువల కింద సాగుభూమి పెరిగింది. తెలంగాణలో మాత్రం అది జరగలేదు. రైతులు తమ రక్తమాంసాలు వెచ్చించి, బావులు తవ్వుకొని, బోర్లు వేసుకొని, కరెంటు మోటర్లు బిగించుకొని సాగుభూమి శాతం పెంచారు. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ రైతుకు ప్రభుత్వ మద్దతు లభించలేదు. రైతు దిక్కులేని పక్షిలా మారాడు. సాగునీటి కొరతతో, ఎరువులూ విత్తనాల కొరతతో, లోవోల్టేజీతో కాలిపోయే కరెంట్‌మోటర్లతో, కరెంటు కోతలతో విలవిలలాడాడు. చివరికి ఉన్నభూమిని అమ్ముకొని, నగరాల్లోని అపార్ట్‌మెంట్లకు వాచ్‌మన్‌గా మారిపోయాడు. వ్యవసాయం చేసే యువకులకు పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకురాని దుర్దశ దాపురించింది. తెలంగాణ ఏర్పడేనాటికి రైతుల జీవన చిత్రం నిస్సహాయతలో, నిరాశలో కూరుకుపోయి ఉన్నది.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు కూడా అక్కడి యాంత్రిక జీవనంతో విసిగి స్వదేశంలో వ్యవసాయం చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన దుష్యంత్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నెలకు నాలుగు లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. అతని భార్య లయ, కోయంబత్తూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ఇద్దరూ సాగుబాట పట్టారు. చేర్యాల మండలం ఆకునూరులో 30 ఎకరాల్లో కూరగాయలు పండిస్తూ హైదరాబాదుకు సరఫరా చేస్తున్నారు. తమ వ్యవసాయ క్షేత్రంలో తమ మేధకు పదునుపెడుతున్నరు. ఇలాంటివాళ్లు మరింత మంది ముందుకు రావాల్సిన తరుణం ఇది. మన దగ్గరున్న అద్భుత అవకాశాలను సరిగా ఉపయోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్నది.
స్వరాష్టంలో సుపరిపాలన తెలంగాణ రైతాంగంలో నూతన విశ్వాసాన్ని నింపింది. యాభై ఏండ్లలో పరిష్కారం కాని కరెంటు సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఏడాది కాలంలో పరిష్కరించి చూపించారు. రైతుల గుండెల్లో కొత్త ఉత్సాహాన్ని చిగురింపజేశారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇరవైనాలుగు గంటలు నిరాఘాటంగా సరఫరా అవుతున్నది. మిషన్ కాకతీయతో చెరువులలో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాల పెరుగుదలకు అది తోడ్పడ్డది. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందుతున్నాయి. బిందు తుంపర సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డ్రిప్ స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందిస్తున్నది. ట్రాక్టర్లు, ఇతర అధునాతన యంత్ర సామగ్రిని భారీ సబ్సిడీతో రైతులకు అందజేసింది. గోదాముల సామర్థ్యం పెరిగింది.
స్వరాష్టంలో సుపరిపాలన తెలంగాణ రైతాంగంలో నూతన విశ్వాసాన్ని నింపింది. యాభై ఏండ్లలో పరిష్కారం కాని కరెంటు సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది కాలంలో పరిష్కరించి చూపించారు. రైతుల గుండెల్లో కొత్త ఉత్సాహాన్ని చిగురింపజేశారు. దేశంమొత్తంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వ్యవసాయానికి ఇరవైనాలుగు గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు నిరాఘాటంగా సరఫరా అవుతున్నది. మిషన్ కాకతీయతో చెరువులలో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భజలాల పెరుగుదలకు అది తోడ్పడ్డది. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందుతున్నాయి. డ్రిప్ స్ప్రింక్లర్లను, ట్రాక్టర్లు, ఇతర అధునాతన యంత్ర సామగ్రిని భారీ సబ్సిడీతో ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నది. గోదాముల సామర్థ్యం పెరిగింది.
కష్టకాలంలోనూ ప్రభుత్వం రైతుబంధు పథకం కోసం 7,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. 25వేల లోపు రైతు రుణాలను మాఫీ చేసింద. రైతుల అవసరాల పట్ల ప్రభుత్వం ఎంత పట్టింపును కలిగిఉన్నదో చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రతి రైతుకు 5లక్షల రూపాయల ఉచితబీమాను కల్పిస్తున్న రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమే. రైతు సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికావటం, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఫలితాలు రైతుల అనుభవంలోకి వచ్చాయి. వివిధ ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు చెరువులు చెక్‌డ్యాములు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. మండుటెండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఎస్సారెస్పీ కాలువలు నిండుగా ప్రవహిస్తూ, చరిత్రలో తొలిసారిగా సూర్యాపేట, కోదాడ వరకు ఉన్న చివరి భూములను సైతం తడుపుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం మంచి ఊపు మీద ఉన్నది. ఇప్పటికే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా ఆవిర్భవించింది. త్వరలోనే సీతారామ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులు పూర్తి అయ్యి ఒక కోటి ముప్ఫైలక్షల ఎకరాలలో బంగారు పంటలు పండబోతున్నాయి.
నియంత్రిత సాగు విధానం మరో నమూనా. ఏ సీజన్‌లో ఏ పంట వేస్తె ఎక్కువ దిగుబడి వస్తుంది? మార్కెట్‌లో ఏ రకం ధాన్యానికి ఎక్కువ డిమాండ్ ఉండబోతున్నది? అనే పరిశోధన, విశ్లేషణను అనుసరించి నియంత్రిత సాగు కొనసాగుతుంది. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది. పండిన పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. రైతుశ్రేయస్సే కేంద్ర బిందువుగా అనేక అంశాలు ఇమిడివున్న నియంత్రిత సాగు విధానం బహుళార్థ సాధక విధానం.
ఒకే రకం పంటలు వేయడం వల్ల భూమి చవుడు బారుతుంది. చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయి. అందుకే పంటల మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీనివల్ల ఎరువుల వినియోగం తగ్గుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పండించిన పంటకు అదనపు విలువ రావడానికి ప్రభుత్వం వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు నడుంకట్టింది. ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామిక వాడలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
రైతులకు తగిన సాంకేతిక విజ్ఞానాన్ని అందించేందుకు వీలుగా వ్యవసాయశాఖను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. రాష్ట్రంలో సాగుబడి అంతా వ్యవసాయ విస్తరణాధికారుల పర్యవేక్షణలో సాగుతున్నది. వ్యవసాయ విస్తరణాధికారులు రైతులతో మమేకమై చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు గ్రామాలలో రైతులు పరస్పరం చర్చించుకోవడం కోసం, వారి అనుభవాలను ఇచ్చి పుచ్చుకోవడం కోసం ఒక వేదికన్నది లేదు. మొత్తం 575 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 2604 రైతువేదికలు త్వరలోనే నిర్మాణం కాబోతున్నాయి. రైతులు తమ ధాన్యం నూర్పిడులు చేసుకోవడానికి వీలుగా 750 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం అంతటా లక్ష కల్లాలు నిర్మాణం కాబోతున్నాయి. ఇది నిశ్చయంగా వ్యవసాయంలో ఒక వినూత్నమైన మార్పు. నేను ఈమధ్య యువకులతో ఎక్కువ సంభాషిస్తున్నాను. రంగనాయక సాగర్ పరిధిలో చెరువులు, చెక్ డ్యాంలు నిండి అలుగుపారుతున్నాయి. ఊరూరా ప్రజలు నీళ్ళసంబురాలు చేసుకుంటున్నరు. అక్కడికి వచ్చే యువకులతో నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. మీరు బాగా చదవండి. వంచిన తల ఎత్తకుండా చదవండి. పుస్తకం చదవటానికి తప్ప ఇంకెక్కడా తల వంచకండి. నేటి ప్రపంచ పోటీలో మీరు గొప్ప అవకాశాలు అందుకోండి. అందుకు కావాల్సిన పట్టుదలను ప్రదర్శించండి. కారణాంతరాల వల్ల అవకాశం చేజారితే మాత్రం కుంగిపోకండి. నిస్పృహలో జీవితాలను గడపకండి. చౌరస్తాలలో నిలబడి కాలం వృథా చేయకండి. మీ అమ్మానాన్నల్ని భూములు అమ్మనివ్వకండి. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయటం నామోషీగా భావించకండి. వ్యవసాయంలో మీ సృజనాత్మకతకు ఆకాశమే హద్దు. చదువువల్ల వచ్చిన మీ తెలివితేటలను వ్యవసాయంతో అనుసంధానం చేయండి.
రైతన్నలారా.. ఇక మీరు నారెప్పుడు పోద్దామా? అని మొగులువైపు చూసే దిగులు లేదు. సకాలంలో విత్తనాలు అందుతయా లేదా అనే బుగులు లేదు. పెట్టుబడి కోసం చేయి చాచాల్సిన అగత్యం లేదు. విత్తనం వేసిన దగ్గర నుంచి మద్దతుధర దాకా అన్ని దశల్లో మీకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. మీలో కష్టించే స్వభావం ఉన్నది. మీకు అండగా నిలిచే ప్రభుత్వం ఉన్నది. రాష్ర్టాన్ని పచ్చని పంటలతో కళకళలాడిద్దాం. బంగారం పండిద్దాం. తెలంగాణ రైతులను సంపన్న వంతులను చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాన్ని నిజం చేద్దాం.
శక్తులు నిండే.. యుక్తులు పొంగే యువకుల్లారా రారండి
నేడు రాష్ట్రంలో కరోనా సంక్షోభం బారినపడి అన్ని రంగాలు నష్టపోయాయి. నష్టపోని ఒకే ఒక రంగం వ్యవసాయం మాత్రమే. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది. ముఖ్యంగా వస్తూత్పత్తి, సేవారంగాల్లో చాలా తీవ్రమైన ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక్కడే తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకున్నది. తెలంగాణ వ్యవసాయం అద్భుతమైన పురోగతి నమోదు చేసింది.
ఉమ్మడిరాష్ట్ర పాలకులు తెలంగాణవాళ్లకు వ్యవసాయం రాదన్నారు. తమనుతాము పరిపాలించుకోలేరన్నారు. ఇక అంతా చీకటే అన్నారు. ఇష్టమొచ్చిన రీతిలో, ఏవేవో అవాకులూ చవాకులూ పేలారు. ఆ అపశకున పక్షుల వాదనలన్నిటినీ పూర్వపక్షం చేస్తూ, నేడు తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నది. వ్యవసాయరంగంలో వస్తున్న నూతన పరివర్తన దానికి తిరుగులేని నిదర్శనం.
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దీర్ఘదర్శి. భవిష్యత్తులో పంటల దిగుబడి భారీగా పెరుగడం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను ఆయన పసిగట్టారు. ముందుజాగ్రత్తగా నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది పంటల క్రమబద్ధీకరణ. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రాధాన్యపంటల సాగు. ఈ విధానం ఒక పంటకో, ఒక సీజన్‌కో ఒక సంవత్సరానికో ఉద్దేశించినది కాదు. ఇందులో మద్దతుధర మొదలుకొని భూసార పరిరక్షణ వరకు అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి.సృజనాత్మకత, క్రమశిక్షణ ఉంటే ఈ రోజు వ్యవసాయాన్ని కూడా ఒక స్టార్ట్ అప్‌గా భావించవచ్చు. అందుకు పూర్తిగా అనుకూల పరిస్థితులు మన రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొన్న విద్యావంతులైన రైతులు తెలంగాణ వ్యవసాయ వైతాళికులు కావాలి.
-( వ్యాసకర్త: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు )