భారత్ – చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందడంపై ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. అయితే, తమ కుమారుడి మరణంపై ఆ మాతృమూర్తి స్ఫూర్తిదాయకంగా స్పందించారు. ‘‘నా కుమారుడు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది.. కానీ తల్లిగా బాధగానూ ఉంది’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారా వీరమాత. తమకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడం బాధగా ఉన్నా దేశం కోసం ప్రాణాలర్పించడం ఆనందంగా ఉందని ఆ దంపతులు అన్నారు.
‘అమ్మా.. బాగున్నావా?’ అన్నాడు!
తమకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరణవార్త తెలిసిందని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లోనే హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా.. కరోనా వల్ల రావడం లేటవుతుందని చెప్పాడని తెలిపారు. చివరిసారిగా తనతో ఆదివారం రాత్రి 10గంటల సమయంలో ఫోన్ చేసి ‘అమ్మా బాగున్నావా?’ అని అడిగినట్టు ఆయన తల్లి గుర్తుచేసుకున్నారు. అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవాడనీ.. తనతో ఎక్కువగా మాట్లాడుతుండేవాడన్నారు. చైనాతో సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని తమతో చెప్పాడనీ.. జాగ్రత్తగా ఉండు నాన్నా.. అని సంతోష్‌కు చెప్పినట్టు ఆ తల్లి గుర్తుచేసుకున్నారు.