తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి 23న సీసీఎల్‌ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే ఈ సాయం జమచేయనున్నారు. వీరితో పాటు ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాదారులకు రైతుబంధు సాయం అందనుంది. అలాగే, పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న 621మంది పట్టాదారులకు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో సాయం అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలు పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇందులో భాగంగా ప్రతిసీజన్‌కు ముందు భూముల లావాదేవీలను పరిశీలించనున్నారు. అమ్మిన భూముల వివరాలను రైతుబంధు జాబితా నుంచి తొలగించి.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు సాయం ఇవ్వనున్నారు. దశలవారీగా నిధుల విడుదలలో భాగంగా తొలుత తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ముందుగా వీరి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రైతుబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ సాయాన్ని వదులుకోవాలనుకునేవారు గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాలని సూచించింది. అలా ఇస్తే ఈ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమచేస్తామని స్పష్టంచేసింది.