ఉపాధి కూలీలకు కనీసం రూ.200 లకు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వెళ్తున్న మంత్రి మార్గ మధ్యంలో ఉప్పరపల్లి వద్ద ఆగి ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు.
రోజు వారీగా ఎంత మేరకు ఉపాధి లభిస్తున్నదని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడారు. కూలీలకు రోజుకు కనీసం రూ.200లకు తగ్గకుండా వేతనం లభించేలా చూడాలని ఆదేశించారు.
ఆ మేరకు ఉపాధి కూలీలకు పనులు చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు అత్యధికంగా పని దినాలు కల్పిస్తున్నామన్నారు.