కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు.
ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నదని వారు చెప్పారు.
అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.