దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్) చేపట్టిన ప్రివలెన్స్ సర్వేలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి లేదని తేలింది. ఐసీఎమ్మార్, ఎన్‌ఐఎన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వివరాలను బుధవారం వెల్లడించింది.
హైదరాబాద్ సహా నాలుగు జిల్లాల పరిధిలో చేపట్టిన సర్వేలో 1,700 మంది నుంచి శాంపిళ్లను సేకరించగా.. ఇందులో 19 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తిని గుర్తించేందుకు మే 15 నుంచి 17వ తేదీ వరకు జనగామ, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఐసీఎమ్మార్ ప్రివలెన్స్ సర్వే చేపట్టింది.
ఒక్కో జిల్లాలో 400 శాంపిళ్ల చొప్పున మొత్తం 1,200 మంది శాంపిళ్లు సేకరించగా, ఇందులో 4 మాత్రమే పాజిటివ్‌గా తేలాయి. ఐసీఎమ్మార్ సర్వేలో అతి తక్కువ మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో వైరస్ సామాజిక వ్యాప్తి లేదని తెలుస్తున్నది. మే 30, 31 తేదీల్లో హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్ జోన్లలో (ఆదిభట్ల, తప్పచబుత్ర, మియాపూర్, చందానగర్, బాలాపూర్) సీరం సర్వే నిర్వహించింది.
ఒక్కో జోన్‌లో 100 శాంపిళ్ల చొప్పున మొత్తం 500 మంది నమూనాలు సేకరించి పరీక్షించగా, కేవలం 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. లాక్‌డౌన్ విజయవంతంగా అమలుచేయడం వల్లే వైరస్ కట్టడి సాధ్యమైందని, ఐసీఎమ్మార్ సర్వే దీనిని స్పష్టంచేస్తున్నదని మంత్రి ఈటల పేర్కొన్నారు