మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత హెచ్.డి.దేవెగౌడ జూన్ 19న జరగున్న రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి నేడు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖ జాతీయ నాయకుల కోరిక మేరకు ఆయన పోటీకి అంగీకరించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 34 మంది జేడీఎస్ సభ్యులున్నారు. రాజ్యసభ సీటు గెలవడానికి ఈ బలం సరిపోదు. ఈ నేపథ్యంలో మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలంతో ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన అదనపు ఓట్లను జేడీఎస్‌కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక అధికార భాజపా తమకున్న బలంతో రెండు సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ పార్టీ ఇప్పటికే ముగ్గురి పేర్లను పార్టీ అధిష్ఠానికి పంపింది.
ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే దేవెగౌడ రాజ్యసభకు వెళ్లడం ఇది రెండోసారి. గతంలో 1996లో ప్రధానిగా చేసిన సమయంలో ఆయన రాజ్యసభ నుంచే ప్రాతినిథ్యం వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన దేవెగౌడ.. భాజపా అభ్యర్థి బసవరాజ్ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.