తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పాజిటివ్ పేషెంట్లు ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా పేషంట్లకు జిల్లాల్లోనే చికిత్స, జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
హోంక్వారంటైన్‌లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ప్రజల్లో ఉన్న భయం వారిని ఆస్పత్రి నుంచి బయటికి రానివ్వడం లేదన్నారు. ఇంట్లో ప్రత్యేక గది లేనివారు ఆస్పత్రిలోనే ఉండాలని కోరుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రుల మీద భారం పెరుగుతుందని వాపోయారు.
క్వారంటైన్‌లో ఉండేందుకు ఇంటిపక్కన ఉన్నవారు సహకరించాలని ఈటల కోరారు. జీవనోపాధి కోల్పోకూడదనే ఉద్దేశంతో లాక్‌డౌన్ ఎత్తేశారని తెలిపారు. అవసరంలేకున్నా బయటికి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవుపలికారు.
ప్రజలు ఎక్కువ మందికి బయటికి రావడంతో వైరస్ వ్యాప్తి పెరిగిందని చెప్పారు. వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స చేయాలని ఈటల రాజేందర్ సూచించారు.