కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్‌చానల్ జర్నలిస్టు దడిగె మనోజ్‌కుమార్ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్ మనోజ్‌కుమార్ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన మనోజ్‌కుమార్ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్‌చానల్ క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్‌కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఆరునెలల గర్భిణి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మనోజ్‌కుమార్ చికిత్స కోసం ఫీవర్ హాస్పిటల్‌కు వెళ్లారు.
పరీక్షించిన వైద్యులు.. ఊపిరితిత్తుల సమస్యలతోపాటు కరోనా లక్షణాలు కనిపించటంతో మెరుగైన చికిత్స కోసం గురువారం గాంధీ దవాఖానకు తరలించారు. మనోజ్‌కుమార్‌కు కండరాలకు సంబంధించిన వ్యాధి ఉన్నదని, ఇందుకోసం శస్త్రచికిత్స చేసి థైమస్ గ్రంథిని తొలగించామని గాంధీ వైద్యాధికారులు చెప్పారు. ఊపిరితిత్తులతోపాటు కరోనాకు చికిత్సపొందుతుండగా, గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు వెల్లడించారు. ఊపిరితిత్తుల సమస్య కూడా ఉండటంతో కరోనా నుంచి కోలుకోవటం కష్టమైందని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం సైదాబాద్‌లో మనోజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. అతడి సోదరుడికి కూడా పాజిటివ్ రావడంతో క్వారంటైన్లో ఉన్నాడు.