తెలంగాణలో కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవడం మొదలైనప్పటినుండి, అంటే దాదాపుగా మూడునెలలుగా గాంధీ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మరెక్కడా చికిత్స లేకపోవడం, కేవలం గాంధీ మాత్రమే అందుబాటులో ఉండడం అన్ని వెరసి వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి.
రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ ను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ రెండు వందల పడకలను కరోనా వైరస్ చికిత్స నిమిత్తం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
సోమవారం నుంచి ఇక్కడ పడకలు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకుతుండడం ఆనందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వారిని రక్షించుకోవడం తొలి ప్రాధాన్యంగా భావించిన ప్రభుత్వం వారికి అక్కడ ప్రత్యేకంగా చికిత్స అందించాలని చూస్తున్నారు.
మిలీనియం బ్లాక్ లోని రెండు అంతస్తులను కరోనా ట్రీట్మెంట్ కు కేటాయించనున్నట్టు తెలియవస్తుంది. ఇక్కడే వీఐపీలకు కూడా ట్రీట్మెంట్ ను అందించే ఆలోచనను చేస్తుంది ప్రభుత్వం..