కరోనా మహమ్మారితో వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికల నగారా మళ్లీ మోగింది. రాజ్యసభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జూన్ 19న ఎన్నికలు నిర్వహించనుంది. 18 రాజ్యసభ స్థానాలకు ఆ రోజు ఎన్నికలు జరుగనున్నాయి.
జూన్ 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టడానికి ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
55 స్థానాల్లో 37 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 4, గుజరాత్‌లో 4, రాజస్థాన్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 3, జార్ఖండ్‌లో 2, మణిపూర్‌లో 1, మేఘాలయలో ఒక స్థానం ఉన్నాయి.
ఖాళీ అయిన ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికల తేదీలు ఖరారు చేసినప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.