కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో చేనేత, టెక్స్‌టైల్, అపారెల్ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీపై నూలు (యార్న్) అందజేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే రెండేండ్లపాటు చేనేతవస్ర్తాలపై పూర్తిస్థాయి జీఎస్టీ మినహాయింపులను పరిశీలించాలని సూచించారు.
లక్షల మందికి ఉపాధి కల్పించే చేనేత, టెక్స్‌టైల్, అపారెల్ పరిశ్రమలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ రంగంపై ఆధారపడినవారికి భరోసా కల్పించేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర టైక్స్‌టైల్‌శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఆదివారం కేటీఆర్ లేఖ రాశారు.
చేనేత, జౌళిరంగంలో పనిచేస్తున్నవారికి కనీసం ఆరునెలలపాటు 50 శాతం వేతనం ఇవ్వాలని, పరిశ్రమకు అవసరమైన దీర్ఘకాలిక రుణాలను అందించాలని కోరారు.
ప్రజలకు పెద్దఎత్తున ఉపాధి కల్పించే ఈ రంగంపై దృష్టి పెట్టడం ద్వారా స్థూలజాతీయోత్పత్తి, ఎగుమతులను పెంచేందుకు అవకాశం ఉన్నదని మంత్రి చెప్పారు. తక్కువ ఖర్చు, తక్కువ భూ వినియోగంతో ఎక్కువ ఉపాధికల్పించే శక్తి ఈ రంగానికి ఉన్నదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ దిశగా పనిచేయాలని కోరారు.