తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పనచేయాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తీసుకొనిరావాలని కేసీఆర్ కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు. శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
‘రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం రూపొందాలి. దానికి అనుగుణంగానే ప్రతీదీ జరుగాలి. రైతులు ఏ పంటలు వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలి. తెలంగాణ ప్రజల ఆహార అవసరాలు, ఇతర ప్రాంతాల్లో డిమాండ్‌కు తగిన పంటలు వేసేలా ప్రణాళిక తయారుచేయాలి. ప్రత్యామ్నాయ పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. దాని ప్రకారమే సాగు జరుగాలి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు