లాక్‌డౌన్ మరో రెండు, మూడు వారాలు పొడిగించాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మే 7వ తేదీ తర్వాత తెలంగాణలో లాక్‌డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కరోనాను పూర్తిస్థాయిలో అంతం చేసేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగించాలా? వద్దా? అని ప్రముఖ న్యూస్ ఛానల్ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 29 నుంచి మే 2 మధ్య తాజాగా రెండో విడత సర్వే చేశారు.
ఈ సర్వేలో తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగించాలని అత్యధికంగా 76శాతం మంది కోరగా..లాక్‌డౌన్ వద్దని 24శాతం మంది ప్రజలు చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పొడిగింపునకు 86శాతం మంది ఓకే చెప్పారు. లాక్‌డౌన్ పొడిగింపు వద్దని కేవలం 14శాతం మంది మాత్రమే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని కూడా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని-(66.4శాతం మంది), బాగుందని-(27.2శాతం), పర్లేదు-(5.8శాతం), బాగాలేదు-(0.6శాతం) అని సర్వేలో వెల్లడైంది.
అలాగే కరోనాపై సీఎం కేసీఆర్ పనితీరు ఎలా ఉందని కూడా సర్వే నిర్వహించగా బాగుంది-(84.8శాతం మంది), పర్లేదు-(14.0శాతం)-బాగాలేదు-(1.2శాతం) మంది సమాధానమిచ్చారు. కరోనా నియంత్రణలో ప్రధాని నరేంద్ర మోదీ కన్నా సీఎం కేసీఆర్ పనితీరుకే ఎక్కువ మంది ఓటేశారు. పనితీరుపై ప్రధాని, సీఎంపై విడివిడిగా సర్వే చేయగా మోదీకి 76.2 శాతం మంది ఓకే చెప్పగా..కేసీఆర్‌కు 84.8 శాతం మంది జైకొట్టారు. కరోనా నియంత్రణకు కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు.
లాక్‌డౌన్‌తోనే వైరస్‌ను కట్టడి చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు తమకు సమంజసమేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రేషన్, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచారని చెప్పుకొచ్చారు.