రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వసతి పెరుగుతున్నందున రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా మారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్రవ్యూహాన్ని ఖరారుచేస్తున్నట్లు వెల్లడించారు.
అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు అవసరమైన విధానం ఖరారుచేయాలని చెప్పారు.
ఎరువులు అందుబాటులో ఉన్నందున రైతులు కొనుక్కోవాలని సీఎం కోరారు. నకిలీ ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అమ్మితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.