తెలంగాణలో పల్లెపల్లెనా ధాన్యరాశులు కనిపిస్తున్నాయనీ, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం కొనుగోళ్లను చేపడుతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ విధానంపై ఇతర రాష్ర్టాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పారు. గురువారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, అప్పాజీపల్లి, చిన్నఘణపూర్, మెదక్ మండలంలోని మంబోజిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కోసం సీఎం కేసీఆర్ రూ.30 వేల కోట్లు సమకూర్చడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడంతో తెలంగాణ నేడు అన్నపూర్ణగా మారిందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు 5,187 కేంద్రాలు, మక్కజొన్నలకు 1,027 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. శనగలు, జొన్నలు, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలుకు కేంద్రం ముందుకు రాకపోయినప్పటికీ సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో చర్చించి, తీర్మానించి ఈ పంటలు కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయ, మార్కెటింగ్ ఉద్యోగులపై దుబ్బాక, వరంగల్ పోలీసుల చర్య గర్హనీయమన్నారు. ప్రజల కోసం పోలీసుల మాదిరిగానే.. రైతుల కోసం వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లానని, బాధ్యులపై చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, సీహెచ్ మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.