కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అన్ని రాష్ర్టాలు పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడిగించకపోతే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ఆయా రాష్ర్టాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ పొడిగింపు వంటి అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే.
ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాలని ఆయా రాష్ర్టాల సీఎంలు కేంద్రాన్ని కోరాయి. ఈ మేరకు మోదీ జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రకటన చేస్తారని అందరూ భావించారు. కానీ మోదీ అనుహ్యంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. మరి రాష్ర్టాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తే.. కేంద్రం మరో మూడు రోజులు ఎందుకు పొడిగించాల్సి వచ్చిందని అందరూ ఆలోచిస్తున్న విషయం.
అయితే ఇక్కడేం పెద్ద విషయమేమి లేదు. ఏప్రిల్ 30వ తేదీ వరకు అన్ని రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ఇక మే 1వ తేదీన మేడే(సెలవు), 2వ తేదీన శనివారం, 3వ తేదీన ఆదివారం వస్తుంది. ఈ మూడు రోజులు వరుస సెలవులు వచ్చాయి. కాబట్టి ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఒక వేళ లాక్‌డౌన్‌ను 30వ తేదీన ఎత్తేస్తే.. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో ఇన్ని రోజులు నివాసాలకే పరిమితమైన ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున కేంద్రం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు సమాచారం.