రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. అంటరానితనానికి వ్యతిరేకంగా బాబా సాహెబ్ చేసిన పోరాటాలను ఈరోజు గుర్తు చేసుకుంటారు. దేశం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతున్న సమయంలో దళితులపై వివక్ష మరోమారు తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ లోని క్వారంటైన్ లో ఉన్న ఒక యువకుడు దళిత మహిళ తయారు చేసిన ఆహారం తినడానికి నిరాకరించాడు.
ఎస్సీ ఎస్టీ చట్టం కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని సిరాజ్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. సిరాజ్ తో పాటు మరో నలుగురు గ్రామంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ఆ యువకుడు మార్చి 29 న ఢిల్లీ నుండి వచ్చి ఈ కేంద్రంలో ఉంటున్నట్లు కుషీనగర్ పోలీసులు తెలిపారు.
దళిత మహిళ లీలవతి దేవి ఆ కేంద్రానికి వెళ్లి ఆహారం సిద్ధం చేశారు. అయితే సిరాజ్ అహ్మద్ తాను లీలవతి దేవి చేసిన ఆహారాన్ని తినబోనని తెలిపాడు. దీనితో ఈ ఉదంతం ఎస్‌డిఎం దేశ్‌దీపక్ సింగ్, బిడిఓ రామకాంత్‌ల వరకు చేరింది. అలాగే లీలవతి దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం కింద అహ్మద్‌పై కేసు నమోదు చేసినట్లు ఖడ్డా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఆర్‌కె యాదవ్ తెలిపారు