తెలంగాణలో కొవిడ్-19 లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. గంటకొట్టినట్టే అంగన్‌వాడీల ద్వారా గర్భిణుల ఇంటి కి ఠంచన్‌గా పౌష్టికాహారం చేరుతున్నది.. గర్భిణుల ఆరోగ్య స్థితిపై ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు వాకబుచేస్తూ సూచనలిస్తున్నారు.. ఆపత్కాలం లో అమ్మఒడి వాహనాలు గడప ముందుకొస్తున్నాయి.
కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులపై మరింత నమ్మకం ఏర్పడింది.. ఫలితంగా ఏప్రిల్, మే నెలల్లో వందశాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతాయని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ అంచనా వేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా మూడునెలల్లో 1,39,887 డెలివరీలు లక్ష్యంగా ఆయా దవాఖానల్లో తగిన ఏర్పాట్లుచేసింది. ఇందులో ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ (ఈడీడీ) సంఖ్య 1,09,665, హైరిస్క్ (హెచ్‌ఆర్) కేసుల సంఖ్య 30,222 ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.
ఈడీడీ కేటగిరీలో 13,198, హైరిస్క్ కేసుల్లో 574 మందికి ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగాయి. ఏప్రిల్‌లో ఈడీడీ కేసులు 45,489, హెచ్‌ఆర్ కేసులు 13,583, మేలో ఈడీడీ కేసులు 50,978, హెచ్‌ఆర్ కేసులు 16,065 ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మూడు నెలల్లో డెలివరీ తేదీల అంచనా, హైరిస్క్ ఉన్న గర్భిణులను సకాలంలో దవాఖానలకు తీసుకొచ్చి ప్రసవాలు జరిపేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
సాధారణ డెలివరీ జరిగే అవకాశం ఉన్న వారిని నిర్ణీత తేదీల్లో కేసీఆర్ అమ్మఒడి వాహనంలో దవాఖానకు తరలిస్తున్నారు. రిస్క్ గ్రూపునకు చెందినవారి పట్ల ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా దవాఖానకు తరలించేలా ఏర్పాట్లుచేస్తున్నారు.