తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఖమ్మంలో కరోనా ప్రభావం లేదు. అంతా సేఫ్ అని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజలు భావిస్తున్న సమయంలో కలవరం మొదలైంది. శనివారం వరకు నాలుగు పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆదివారం ఓ ఎనిమిదేళ్ల బాలికకు లక్షణాలున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం ఖిల్లాకు చెందిన ఆ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరికి కరోనా రాగా.. అదే కుటుంబానికి చెందిన బాలికకు లక్షణాలు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు.
ఖిల్లాకు చెందిన 65 ఏళ్ల రిటైర్డ్ ఎలక్ర్టిసిటీ ఉద్యోగి కరోనా బారిన పడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. 35 ఏళ్ల వయసున్న అతని కోడలికి పాజిటివ్ ఉన్నట్టు శనివారం రిపోర్టు వచ్చింది. దీంతో ఆమెను ఖమ్మంనుంచి హైదరాబాద్‌కు తరలించగా.. క్వారంటైన్‌లో ఉన్న ఆమె 8 ఏళ్ల కూతురికి కూడా ఆదివారం పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
దీంతో ఆ చిన్నారిని కూడా హైదరాబాద్ తరలించారు. ఒకే కుటుంబంలోని తాత, తల్లికి ఇప్పుడు చిన్నారికి కరోనా రావడం.. అసలు వారికి ఎవరినుంచి వైరస్ వ్యాప్తి చెందిందన్న విషయం మిస్టరీగా మారింది. అయితే ఈ కేసుల విషయమై పోలీసులు, వైద్యరోగ్య శాఖ అధికారుల విచారణకు కొందరు సహకరించడం లేదని తెలుస్తోంది.