కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. కరోనా బారిన పడి అట్టుడుకుతున్న దేశాల్లో నిన్న మొన్నటి వరకు ఇటలీ తొలిస్థానంలో ఉండగా ఇప్పుడు అమెరికా ఈ స్థానానికి ఎగబాకింది.
కరోనా మృతుల సంఖ్య సహా పాజిటివ్ కేసుల్లోనూ అమెరికా ముందు వరుసలో నిలవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్-19 వైరస్ సోకిన వారిలో గంటకు 83 మంది చొప్పున పిట్టల్లా రాలిపోతున్నట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
ఆదివారం రాత్రికి దేశవ్యాప్తంగా 21,474 మంది కరోనా కాటుతో తుదిశ్వాస విడిచినట్టు పేర్కొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరిలో ఒకరి మరణంతో మొదలైన మృత్యుఘోష.. శర వేగంగా ప్రజల ప్రాణాలను కబళించేస్తోందని తెలిపింది. ప్రస్తుతం 5.45 లక్షల మంది పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.