కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
వైరస్ సోకినవారికి చికిత్స అందించడంతోపాటు వారితో కలిసినవారిని గుర్తించి, క్వారంటైన్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
వరికోతలు, ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు, అధికారులకు పలు సూచనలు చేశారు.