తాను 24×7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో కొవిడ్-19 పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో తాజా పరిస్థితులను సభ్యులకు వివరించింది. అనంతరం ఒక్కో ముఖ్యమంత్రి తమ అభిప్రాయాల్ని ప్రధానితో పంచుకున్నారు.
చాలా మంది సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు. మరోవైపు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బిహార్ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దినసరి కూలీలకు మాత్రం మినహాయింపునివ్వాలని కోరింది. ఇప్పుడు అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న విషయం తెలిసిందే.
లాక్‌డౌన్ విధించిన తర్వాత సీఎంలతో ప్రధాని సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి. ఏప్రిల్ 2న జరిగిన కాన్ఫరెన్స్‌లో 14వ తేదీ తర్వాత తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. సాధారణ పరిస్థితుల్ని పూర్తిగా పునరుద్ధరించడం కుదరదని అప్పుడే స్పష్టం చేశారు. దశలవారీగా ఆంక్షల సడలింపు ఉంటుందని సంకేతాలిచ్చారు. తాజాగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగాలని రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చిన విషయం తెలిసిందే.
మోదీ మాస్క్ ధరించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సాధారణ మాస్క్ కాకుండా తెల్లటి వస్త్రంతో చేసిన మాస్క్ వేసుకున్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే పలువురు ముఖ్యమంత్రులు సైతం మాస్క్ ధరించారు. ఇంట్లో తయారు చేసిన రెండు పొరలతో కూడిన మాస్క్‌ను ధరించొచ్చని గత వారం కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా నేడు మోదీ మాస్క్‌ను ధరించినట్లు తెలుస్తోంది.