హైదరాబాద్‌కు చెందిన ‘హువెల్ లైఫ్ సైన్సెస్’ సంస్థ అరుదైన ఘనత సాధించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపడానికి ఆ సంస్థ అభివృద్ధి చేసిన టెస్ట్ కిట్‌కు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ సంస్థలు తయారుచేసిన మొత్తం 24 కిట్లలో ఆరింటికి మాత్రమే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇందులో హువెల్ లైఫ్ సైన్సెస్ కిట్ కూడా ఉండటం విశేషం.
అమెరికా నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ కిట్‌ను తయారుచేశారు. కొవిడ్-19తోపాటు సార్స్ వంటి ఇతర కరోనా వైరస్‌లను కూడా గుర్తించే విధంగా ఈ కిట్‌ను రూపొందించారు.
డిటెక్షన్ కిట్, ఎక్స్‌ట్రాక్షన్ కిట్, మాలిక్యులర్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం (ఎంటీఎం), నమూనా సేకరణకు స్వాబ్ సహా అన్నీ ఇందులో ఉంటాయి. తమ కిట్లకు ఐసీఎంఆర్ ఆమోదం లభించిన నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ శక్తి నాగప్పన్ మీడియాతో మాట్లాడారు. ‘మా సంస్థకు నార్సింగి, కోకాపేట్‌లో కేంద్రాలు ఉన్నాయి.
ప్రస్తుతం రోజుకు 3000-4000 కిట్లు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశంలో ఎక్కడికైనా ఈ కిట్‌లను సరఫరా చేయవచ్చు. కిట్స్ ప్రత్యేకత చెప్పాలంటే.. ఇందులోని ప్రతి ఒక్క ఎంజైమ్‌నూ సొంతంగా అభివృద్ధి చేశాం. దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి కంపెనీ మాదే’ అని వివరించారు.