కోవిడ్-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గుంటూరులో ‘ప్రత్యేక క్రిమిసంహారక టన్నెల్స్ (covid-19 Disinfection Tunnels)ను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరులోని సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాధం భరత్ రెడ్డి, ఆయన మిత్రులు, ప్రముఖ వైద్యులు కలిసి స్వంతఖర్చులతో ఈ టన్నెల్స్ ఏర్పాటుకు పూనుకున్నారు.
ఇందులో భాగంగా గురువారం స్థానిక రెయిన్ ట్రీ పార్కు వద్ద ఏపీ ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతులమీదుగా మొదటి టన్నెల్ ను ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రజల్ని వైరస్ల బారినుంచి కాపాడేందుకు ఇటువంటి క్రిమిసంహారక టన్నెల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని సజ్జల అన్నారు.
విపత్కర కాలంలో ప్రభుత్వానికి చేదోడుగా నిలిచే సిమ్స్ భరత్ రెడ్డి, వారి మిత్రుల వితరణ చాలా అభినందనీయమన్నారు. గుంటూరు నగరంలో అధిక జనసంచారం ఉండే పది రద్దీ ప్రాంతాల వద్ద ఈ టన్నెల్స్ ఉంటాయని భీమనాధం భరత్ రెడ్డి చెప్పారు. తొలివిడత కింద నగరపాలకసంస్థ, అర్బన్ ఎస్పీ, కలెక్టరేట్ కార్యాలయాలతో పాటు పలు రైతుబజార్ల వద్ద ఈ క్రిమిసంహారక టన్నెల్స్ ను ఏర్పాటు చేస్తామని భరత్ రెడ్డి వివరించారు.
రాష్ట్రంలో ఈ తరహా టన్నెల్స్ ఏర్పాటు ఇదే మొదటిసారని ఆయన అన్నారు. మూడు నాజిల్స్ కలిగిన రెండు సెట్లు ఒక(1) పిపిఎమ్ కు ..ఒక(1) మిలియన్ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తాయి. ప్రజలు సొరంగం(టన్నెల్) లోపల మూడు నుండి ఐదు సెకన్ల వరకు నడుస్తారు. వారిపై స్ర్పే చేసిన తరువాత, వైరస్ ను చంపడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని సిమ్స్ డైరెక్టర్ భీమనాధం భరత్ రెడ్డి చెప్పారు.
టన్నెల్ (సొరంగం)లోకి ప్రవేశించేటప్పుడు కార్మికులు, ప్రజల సభ్యులు సమర్థవంతంగా క్రిమిసంహారక చర్యకు తమ అరచేతులను ముందు వైపు ఎదురుగా చేతులు ఎత్తాలని సూచించారు. తరచుగా చేతులు కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలకు అనుబంధంగా మాత్రమే ఈ టన్నెల్ ఉంటుందని ఆయన అన్నారు.
సుమారు వెయ్యి
లీటర్ల సామర్ధ్యంతో ఉండే ఈ క్రిమిసంహారక సొరంగం 16 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. టన్నెల్ ప్రారంభ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి రోశయ్య, సిమ్స్ భరత్ రెడ్డి మిత్రులు, గుంటూరు నగర ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.