వైరస్ వ్యాప్తిని నిరోధించడంతోనే కరోనా నుంచి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మూడు దశల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కన్నా ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగాఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించవచ్చన్నారు.
జూన్ మొదటివారానికి దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వెల్లడవుతున్న పలు నివేదికల మేరకు.. దాన్ని ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ పొడిగింపే సరైందనుకొంటే.. అందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి కేటీఆర్ మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. అమెరికా, యూరప్ దేశాల్లో తలెత్తిన పరిస్థితులు మనదేశంలో రాకుండా ఉండాలంటే లాక్‌డౌన్, సామాజికదూరం పాటించడం ఒక్కటే మార్గమన్న అభిప్రాయాన్ని ప్రధానికి సీఎం కేసీఆర్ తెలిపారన్నారు.