కష్ట సమయాలలో తామున్నామనే భరోసా ఇస్తు మంచి మనసు చాటుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ భారీ విరాళాలు అందించగా, తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు వీకే నరేష్ ఈ సమయంలో ‘మా’ సభ్యులకు అండగా నిలబడటం తన బాధ్యత అని భావించారు.
ఇందులో భాగంగా ఆయన 100 కుటుంబాలని దత్తత తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘మా’ ద్వారా సర్వే చేయించి 58 మంది సభ్యులకు ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 10,000 చొప్పున డిపాజిట్ చేశారు.
అదే విధంగా సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) మనకోసం కి తన వంతుగా మరో రూ. 1 లక్ష విరాళం అందజేస్తున్నట్లు నరేష్ ప్రకటించారు.
అలానే టాలీవుడ్ హీరో గోపిచంద్ 1000కి పైగా ఉన్న పేద కుటుంబాలకి నెల రోజుల పాటు నిత్యావర వస్తువులు, సరుకులు అందిస్తానని అన్నారు. కరోనాని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరు ఇళ్లల్లోనే ఉండాలని వారు పేర్కొన్నారు