కరోనా పాజిటివ్ కేసులో ఏపీలో ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం… ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40గా ఉంటే… అనధికారికంగా 58 అని తెలుస్తోంది. తాజాగా… పశ్చిమ గోదావరి జిల్లాలో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. సోమవారం వరకూ ఇక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. అలాంటిది ఇప్పుడు 14 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో 8, భీమవరంలో 2, ఉండిలో 1, గుండుగొలనులో 1, పెనుగొండలో 1 కేసు నమోదైనట్లు తెలిసింది. దీనిపై జిల్లా అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే… ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదే నిజమైతే… ఏపీలో అత్యధిక పాజిటివ్ కేసులున్న జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా నిలుస్తుంది.
ఒక్కసారిగా ఇన్ని కేసులు నమోదవ్వడానికి కారణం ఢిల్లీ ప్రార్థనలే అంటున్నారు. ఆ ప్రార్థనల్లో పాల్గొన్న కొందరికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయనీ, అందువల్లే కేసుల సంఖ్య ఏపీలో పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీ అధికారులు… ఆ 14 మంది ఎక్కడెక్కడ తిరిగిందీ తెలుసుకుంటున్నారు. ఎవరెవర్ని కలిసిందీ ఆరా తీస్తున్నారు. వాళ్లను ఏలూరు ప్రభుత్వాసుపత్రి, ఆశ్రం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డుల్లో ఉంచారు. అలాగే ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. వారిని స్వయంగా వచ్చి ఆస్పత్రుల్లో చెకప్స్ చేయించుకోవాలని కోరుతున్నారు. ఉచితంగానే అన్ని పరీక్షలూ జరుగుతాయని అంటున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు తమ వివరాల్ని దాచిపెడితే… అది ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంటుందనీ… అలా చెయ్యవద్దనీ చెబుతున్నారు.