కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల పూర్తి లభ్యత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ అన్నారు, విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల కదలికలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇంటింటికీ సర్వే నిర్వహించి, వారి నుండి ఇతరులకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవటం ముదావహమన్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్న సమావేశంలో ప్రెసిడెంట్ కోవింద్ ఎంపిక చేసిన రాష్ట్రాల గవర్నర్ల తో మాట్లాడుతూ సామాజిక దూరం మాత్రమే వ్యాధి వ్యాప్తిని నిరోధించే అవకాశం కలిగి ఉన్నందున తదనుగుణంగా వ్యవహరించాలనిసలహా ఇచ్చారు,
కరోనావ్యాప్తికి వ్యతిరేకంగా దేశంమొత్తం తగిన సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని, మరోవైపు ఒంటరిగా, సామాజిక దూరాన్ని కొనసాగించ వలసిన అవశ్యకత కీలకమైనదని స్పష్టం చేసారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమ కున్న అనుభవ సారంతో అక్కడి ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయాలని అభ్యర్థించారు. సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రార్థనల పేరిట సమావేశాలు వద్దని మత పెద్దలు ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. టెస్ట్, ట్రేస్, ఐసోలేట్ అండ్ ట్రీట్’ అనే మంత్రాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, నిత్యావసర వస్తువుల సరఫరా, విద్యార్థులకు ఆహార లభ్యత, ఆశ్రయం, వలస కూలీలకు ఆహారం ఉండేలా ప్రభుత్వాలు జాగ్రత్తలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. వైరస్ గురించి అవగాహన కల్పించి, ఇతర రాష్ట్రాల విద్యార్థులను జాగ్రత్తగా చూసుకునేలా చిత్ర పరిశ్రమ, సాహిత్య సంస్థలు, ప్రైవేటు రంగ సేవలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించారు.