ఒకవేళ కరోనా రాష్ట్రంలోనూ ప్రబలితే ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి, సీఎస్, ఇతర వైద్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్టు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యాధి ప్రబలితే ఇంకొకరిపై ఆధారపడకుండా మనకున్న వసతులు, వైద్య సిబ్బందితో కలిసి ఎంతవరకు ఎదుర్కోగల్గుతామన్న విషయంపైనా చర్చించినట్టు చెప్పారు. ‘వందమంది వైద్య సిబ్బంది అవసరమైతే 130 మందిని మనం సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది.
వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లుతోపాటు ఇతర సిబ్బంది.. వారికి వసతి, భోజనాలు, రవాణా వాహనాలు ఇలా పూర్తిస్థాయిలో ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వం వందశాతం సంసిద్ధంగా ఉన్నది. మొత్తం 11 వేలమందిని ఐసొలేషన్ వార్డులో పెట్టుకొనేలా ప్లాన్ చేసుకున్నాం. 1400 క్రిటికల్ కేర్ బెడ్లను సిద్ధం చేశాం. గచ్చిబౌలి స్టేడియంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు రెండురోజుల్లో పూర్తవుతాయి.
గాంధీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ లైన్లు ఏర్పాటుచేస్తున్నాం. కింగ్‌కోఠి దవాఖానలో కూడా అవసరమైన ఏర్పాట్లుచేస్తున్నాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 500 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చామని, వాటిలో కొన్ని అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటికిప్పుడు 12,400 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నా వారికి వైద్యం అందించేలా ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నదన్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60వేల మందికిచేరినా వారికి వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లుచేస్తున్నట్టు పేర్కొన్నారు.